ఎవరు ఎన్ని చెప్పినా నేడు రాజకీయాలు, రాజకీయ నాయకులు పూర్తిగా మారిపోయారు. ఏ పార్టీని చూసినా ఏముంది గర్వకారణం? అన్నట్లుగా దేశ రాజకీయాలు మారిపోయాయి. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి, పార్టీలకు భారీ స్థాయిలో ఫండ్స్ చేకూరిస్తేనే గానీ రాజకీయాలు జరిగేలాలేవు. నేడు చంద్రబాబు, లోకేష్‌లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన తనయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ కోట్లకుకోట్లు సంపాదించింది కూడా నిజమే.. అవి కోర్టుల్లో నిలబడతాయా? లేదా? అన్నవిషయం పక్కనపెడితే జగన్ నాడు భారీ స్థాయిలో ఆర్థికంగా లాభపడ్డాడనేది వాస్తవం. ఇక బిజెపి ఏమీ తక్కువ తినలేదు.
గాలి జనార్ధన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చి ఉండవచ్చు. కానీ ఆయన చేసిన ఆర్ధిక నేరాలు మాత్రం నిజమేనని ఎవరైనా చెబుతారు. ఇక ఇటీవల తమిళనాడులోని శశికళ వర్గం తమకే రెండాకుల గుర్తు కావాలని ఈసీకి పెద్ద మొత్తంలో లంచం ఇవ్వబోయింది. నిందుతుడైన దినకరన్ మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చేసి, మరలా రాజకీయాలు మొదలుపెట్టాడు. ఇక జగన్ విషయానికి వస్తే ఈసీ ఆయనకు ఫ్యాన్ గుర్తును ఇంకా కేటాయించకమునుపే ఫ్యాన్ గుర్తుతో కీచైన్లు, పోస్టర్లు వెలిశాయి. దీన్ని బట్టి మన రాజకీయాలు క్షుణ్ణంగా అర్ధమవుతాయి. ఇక ఇటీవల జగన్ మోదీని కలవడం, దానిపై టిడిపి, బిజెపి నాయకులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక వచ్చేఎన్నికల్లో పొత్తుపై ఎవరి వాదనలు వారివి. కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఈ ఊసరవెల్లి రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం దేవుడి వల్ల కాదు. రాజకీయాలలో అవసరాలని బట్టి అన్నీ సమీకరణాలు మారుతుంటాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు.
ఇక జగన్ మోదీతో భేటీ వెనుక గాలి జనార్దన్‌రెడ్డి లాబీయింగ్ బాగా పనిచేసిందని, ఆయనే మోదీతో జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా జగన్‌కి దొరకని మోదీ అపాయింట్‌మెంట్ గాలి బయటకు రాగానే జరిగిపోయింది. ఇక జగన్ మీద కేసులు కూడా ఒక్కోక్కటిగా వీగిపోతున్నాయి. మిగిలిన కేసుల నుండి కూడా ఆయన్ను బయటపడేసి, సిబిఐని తాను చెప్పేట్లు చేయనిస్తే.. మోదీకి రాబోయే ఎన్నికల్లో ఆర్ధికంగా ఫండ్స్‌తో పాటు కర్ణాటక, ఏపీలలో బిజెపి అభ్యర్ధుల ఎన్నికల ఖర్చును తామిద్దరమే భరిస్తామని గాలి, జగన్‌లు మోదీకి వర్తమానం పంపారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.