తాజాగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారులు, అబ్దుల్‌కలాం వంటి శాస్త్రవేత్తలు, రాష్ట్రపతులు.... ఇలా బయోపిక్‌లు రూపొందుతున్నాయి. కాగా మిల్కా సింగ్ తన 'బాగ్ మిల్కా బాగ్'కు కేవలం రూపాయి మాత్రమే పారితోషికం తీసుకున్నాడు. ఇక 'దంగల్' విషయంలోనూ అదే జరిగింది. 'అజర్, ధోని'లు కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు. కానీ సచిన్ మాత్రం తన బయోపిక్ అయిన 'సచిన్-ది బిలియన్ డ్రీమ్స్'కి పట్టుబట్టి మరీ బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువగా ఏకంగా 45కోట్లు చార్జ్ చేశాడట.
ఇక ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జీవితంపై ఓ బయోపిక్ రూపొందుతోంది. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను పరమ కాంగ్రెస్ ద్వేషి, బిజెపి నాయకుడు అనుపమ్‌ఖేర్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం పేరు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్'. విజయ్‌రత్నాకర్ దర్శకత్వంలో హన్సల్ మెహతా ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మన్మోహన్‌సింగ్‌తో పాటు సోనియాగాంధీ, పివి నరసింహారావు నుంచి ఎందరో ప్రముఖుల పాత్రలు ఉంటాయి. కాబట్టి ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వాలంటే సోనియా, మన్మోహన్ సింగ్‌ల పర్మిషన్ తీసుకొని, వారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేవాలని కేంద్ర సెన్సార్ బోర్డ్ అధ్యక్షుడు అదేశించారు.
ఒక వ్యక్తి జీవితంమీద సినిమా తీస్తున్నప్పుడు తమ పరిశోధనలో తెలిసిన వాస్తవాలను చూపించాల్సి ఉంటుంది. వారి మంచి పనులతో పాటు వారు చేసిన పొరపాట్లు, తప్పులను కూడా ఎత్తిచూపినప్పుడు నిజమైన బయోపిక్ అనిపిస్తుంది. అంతేగానీ కేవలం భజన చేయడానికైతే కోట్లు ఖర్చుపెట్టి బయోపిక్‌లు తీయాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎవరినైనా తప్పుగా చూపిస్తే ప్రశ్నించడానికి వారి అభిమానులు, వీరాభిమానులు, మీడియా ఎలాగూ ఉంటాయి. సినిమా విడుదల కాకముందే ఇన్ని కండీషన్లు ఏమిటి?
జీసస్‌ని, రాముడిని, కృష్ణుడిని విలన్లుగా చిత్రీకరిస్తూ నెగటివ్ పాత్రలైన ధుర్యోధనుడు, కర్ణుడి వంటి వారిని హీరోలుగా వారి యాంగిల్‌లో కూడా చిత్రాలు వచ్చాయి. అంతేగానీ కళలకు సంకెళ్లు మంచిది కాదు. వర్మ 'సర్కార్3'కి కూడా ఇవే ఇబ్బందులు ఎదురై, పలు సీన్లకు కత్తెరపడి సినిమానే ఫ్లాప్‌అయింది.