ఇటీవల తమ హీరో సినిమాకు వేరే హీరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు హీరోల ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దాంతో వారు కూడా తమ ఎదుటి హీరోల చిత్రాలు విడుదలైతే ఇలాంటి దుష్ప్రచారమే చేస్తున్నారు. ఇటీవల వచ్చిన పవన్ 'సర్దార్ గబ్బర్‌సింగ్', మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రాల విషయంలో ఇది పీక్స్‌కి వెళ్లింది. కానీ అది అంత మంచి పద్దతి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వైపరీత్యం త్వరత్వరగానే అందరూ హీరోలకు పాకుతోంది. ఇక పవన్ సినిమాలను బన్నీ అభిమానులు, బన్నీ అంటే పవన్ అభిమానులు కస్సున లేస్తున్నారు. దీనికి నాటి 'చెప్పను బ్రదర్' అనేది ఒక కారణమై ఉండవచ్చంటున్నారు. ఇక తాజాగా బన్నీ-హరీష్‌శంకర్-దిల్‌రాజుల కాంబినేషన్‌లో వస్తోన్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ వార్ మరింత ముందుకెళ్ళింది.
ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్, రామయ్యా వస్తావయ్యా', కన్నడ డబ్బింగ్ చిత్రం 'బ్రాహ్మణ', శంకర్-అర్జున్‌ల 'జెంటిల్‌మేన్' వంటి చిత్రాల పోలికలు ఈ చిత్రంలో ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. కొందరు ఇది ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న దుష్ప్రచారంగా భావిస్తుంటే మరికొందరు మాత్రం కాదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఇది పవన్ అభిమానులు చేస్తున్న ప్రచారమంటున్నారు. మొత్తానికి ఈ గొడవలు పోను పోను మరింత రాజుకునేలా ఉన్నాయే గానీ.. వీటికి చెక్ పెట్టేందుకు ఏ హీరో కూడా ముందుకు రాకపోవడం శోచనీయం..!