వచ్చే ఎన్నిలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చిన నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్దమని వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేనాధిపతి పవన్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఈ నేపద్యంలో ఎన్నికలు వస్తే తమ తమ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయంలో అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి.
తాజాగా తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు వస్తే తమకు 111 స్థానాలు, ఎంఐఎంకు 6 స్థానాలు వస్తాయని కేసీఆర్ చెప్పాడు. ఇక ఏపీలో కూడా పలు పార్టీలతో పాటు స్వతంత్ర సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. నేడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే టిడిపి పతనం తప్పదని, ఖచ్చితంగా అసెంబ్లీలో అవసరమైన మెజార్టీ సీట్లు వైసీపీ సాధించడం ఖాయమని ఓ నమ్మకమైన సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది.
ఇప్పటి వరకు రాజధాని అమరావతి పురోభివృద్ది పనులు జరగకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోవడంతో వైసీపీ ఖచ్చితంగా గెలిచి జగన్ సీఎం కావడం ఖాయమని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక పవన్‌కు కొంత ఓటు బ్యాంకు ఉందని, అయితే ఒక 10 నుంచి 15సీట్లు వరకు మాత్రమే రావచ్చని, ముఖ్యంగా పవన్ వల్ల కిందటి ఎన్నికల్లో టిడిపి కూటమికి పడిన ఓట్లు చీలుతాయని, అది వైసీపీకే లాభమని సర్వే తేల్చేసింది.
ఇంతకాలం చాలా మంది పవన్ 'జనసేన' వల్ల టిడిపి వ్యతిరేక ఓట్లు వైసీపీ, జనసేన మధ్య చీలి కాస్త టిడిపికే పవన్ వల్ల అనుకూలమని అందరూ భావిస్తూ వచ్చారు. ఇక గుంటూరులో జరిగిన కాంగ్రెస్ సభ కాస్త బాగానే సక్సెస్ కావడంతో ఇక సీట్లు గెలవకున్నా కూడా కాంగ్రెస్ స్పీడ్ పెంచితే అది వైసీపీపై ప్రభావం అధికంగా ఉంటుందని తేలింది. మొత్తానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ వైసీపీ తరపున తీసుకునే ఎత్తులు పైఎత్తులు జగన్ కనుక పాటిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్‌దే విజయమని తేల్చేస్తున్నారు.