ఇండియాలో గాలి జనార్దన్ రెడ్డి పేరు తెలియని వారుండరు. పొలిటీషియన్ గా చక్రం తిప్పుతున్నప్పుడే మైనింగ్ మాఫియా, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లోచ్చిన గాలి జనార్దన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ జైల్లో కూడా ఊచలు లెక్కబెడుతూనే జడ్జికి లంచం ఇవ్వజూపాడానే ఆరోపణ కూడా గాలి మీద పడింది. ఎప్పుడూ బంగారు పళ్లెంలో భోజనం చేస్తూ.. బంగారు సింహాసనాన్ని అధిష్టించి పట్టు పాన్పులపై నిద్రపోయే గాలి కొన్నాళ్ళు జైల్లో చిప్పకూడు తిని... కటిక నేలపై పడుకుని శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటికి వచ్చాడు.
అలా జైలుకెళ్లోచ్చిన గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లిని సినిమా స్టయిల్లో అంగరంగ వైభవంగా చేసి మళ్లీ ఐటి కన్ను తనమీద పడేలా చేసుకున్నాడు. కూతురు బ్రాహ్మణి పెళ్ళిలో సినిమా తారలతో డాన్స్ లు గట్రా చేయించిన గాలి ఆ పెళ్ళిలో డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టేశాడు. ఇక పెళ్లి తర్వాత ఐటి శాఖ వారు కొన్ని దాడులు నిర్వహించినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ పెళ్లి దగ్గర నుండి సైలెంట్ అయిన గాలి మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్ళకి మీడియాలో హైలెట్ అయ్యాడు. ఈసారి సినిమా ఇండస్ట్రీలో పాగా వెయ్యడానికి గాలి ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు.
తన కొడుకు కిరీటి రెడ్డి హీరోగా తానే తన ప్రొడక్షన్ లో సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. తన చెల్లి పెళ్ళిలో సినిమా తారలతో డాన్స్ లు చేసిన కిరీటి రెడ్డికి సినిమాల మీద గాలి మళ్లిందట. అందుకే హీరో అవతారమెత్తాలని తండ్రిని అడగ్గా దానికి ఒకే అన్న గాలి తానే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తన సొంత బ్యానర్ లోనే కొడుకుని టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే కిరీటి ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్ కోసం గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టాడని అంటున్నారు. చూద్దాం కిరీటి ని డైరెక్ట్ చేసే అదృష్టం టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ ని వరిస్తుందో..?