సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయి స్వంత రాష్ట్రంగా మారి ఏపీ ప్రజలకు మూడేళ్లయింది. దీనిలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలు చేయిస్తున్నాడు. కానీ జనాలు మాత్రం రావడం లేదు. ఎండలకు భయపడి అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ సంఘాలు చేసిన సమైక్య ఉద్యమం సమయంలో కూడా ఎండలు ఇలాగే ఉన్నాయి. కానీ ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు.
మరి నవ నిర్మాణ దీక్షకు ఎందుకు రావడం లేదో బాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ మూడేళ్లలో ఆయనేమైనా ప్రజల కష్టాలను, హామీలలో ఒక్కటైనా తీర్చారా? అంటే లేదనే చెప్పాలి. ఇంటికో ఉద్యోగం వల్ల లోకేష్‌కి మాత్రమే పదవి వచ్చింది. అమరావతిని ఒకసారి సింగపూర్ అంటాడు. మరోసారి మలేషియా అంటాడు. మరోసారి జపాన్ అంటాడు. జపాన్ రెండో ప్రపంచ యుద్దంలో సర్వనాశనమైపోయినా తిరిగి మరలా పట్టుదలతో పుంజుకున్న విషయం గుర్తు చేస్తాడు. నిజమే.. జపాన్ అద్భుతం. కానీ నాడు జపాన్ ప్రజలకు నాటి జపాన్ నాయకులు ఆదర్శంగా నిలిచారు. మరి నేడు ఏపీ ప్రజలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? కోట్లకు కోట్లు స్కామ్‌లు చేస్తున్న, అక్రమ ఇసుక, మైనింగ్‌లు, వైజాగ్‌లో పేదలు కష్టపడి సంపాదించి కొనుకున్న స్థలాలను కజ్జాచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లే అన్ని చేస్తున్నారు. కోట్లు మేస్తున్నారు.
స్వయాన తెలుగు దేశం మంత్రి అయ్యన్నపాత్రుడే వైజాగ్ దందా వెనుక రాజకీయ కోణం, అధికారుల అండలున్నాయని అంగీకరించాడు. మరి వీరిపై చంద్రబాబు తీసుకున్న చర్యలేమిటి? ఇప్పటికీ పని ప్రారంభించకుండా అద్భుతమైన అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపి 'బాహుబలి3' ని చంద్రబాబు ప్రజలకు చూపిస్తున్నాడు. తన నేటి పాలన కంటే తాను గతంలో చేసిన పాలనే మేలని నేడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక జగన్ సంగతి ఆ దేవుడికే తెలియాలి. ఆయన అప్పుడప్పుడు రెండు మూడురోజులు దీక్షలు చేసి అలసిపోయి విదేశాలలో, లోటప్‌పాండ్‌లో సేదతీరుతుంటాడు. రోజాలాంటి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
తమ పాలకపక్ష, ప్రతిపక్ష లోపాలను కప్పి పుచ్చుకోవడానికి ఇప్పటికీ సామాన్య ఏపీ ప్రజలకు ఇంకా విభజన బూచిని చూపి గాయం మాననివ్వకుండా చేస్తున్నారు. అసలు అభివృద్ది చేయాల్సిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సొంత లాభం చూసుకుంటుంటే, ప్రభుత్వ ఉద్యోగులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే ప్రజల చేత దీక్షలు, ప్రతిజ్ఞలు చేయించడం ఏమిటి? ప్రత్యేక ప్యాకేజీ అనే ముష్టిని అప్యాయంగా ముద్దుపెట్టుకొని పొగడడం ఏమిటి? కేంద్రం ముందు సాగిల పడి ఇదంతా రాష్ట్రం కోసమే. కేంద్రం సహకరిస్తేనే మనం అభివృద్ది చెందుతాం అనే పరాన్న జీవులు ఎక్కడైనా ఉన్నారా? కావాలంటే కేంద్రం మీద పోరాటం చేయండి.
ప్రజలు అండగా నిలబడతారు. ఎన్నో బిజేపీయేతర రాష్ట్రాలు కూడా కేంద్రం నడ్డి వంచి అనుకున్నవి సాధిస్తున్నాయి. తెలుగు జాతి పౌరుషాన్ని, ఏపీ ప్రజల మనోభావాలను ఢిల్లీలో తాకట్టుపెడుతున్న బాబు, జగన్‌లను చూసి, కేంద్రం ప్రాపకం కోసం వారు వెంపర్లాడుతున్న విధానం చూసి ప్రజులు సిగ్గుతో చచ్చిపోతున్నారు...!