దేశప్రధానిగా మోదీ గెలిచినప్పుడు ఇకనైనా కష్టాలు తీరుతాయని, సంసారం, బంధాలు, బంధుత్వాలు పట్టించుకోని మోదీ మనకు ఏదో చేస్తాడని ఎందరో ఆశ పడ్డారు. కానీ ఆ తర్వాత ఈ మూడేళ్లలో తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే.. మోదీకి పబ్లిసిటీ యావ ఎక్కువ. సెలబ్రిటీలతో కలవడానికి, ఖరీదైన దుస్తులతో కెమెరాలకు ఫోజులివ్వడం ఆయన బలహీనతగా తేలింది. తాజాగా ఆయన బెర్లిన్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి, 'బేవాచ్' ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంకా చోప్రా ఆయన్ను కలిసింది.
కలవడమే కాదు.. తొడలు కనిపించేటట్లు వస్త్రధారణ చేసుకుని, ప్రధాని ముందు కాళ్లపై కాళ్లు వేసుకొని, నిర్లక్ష్యంగా ఫోజులిచ్చింది. దానిని పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. కానీ ఆమె 'నా లెగ్స్ మా మదర్ మధు చోప్రా నుంచి జీన్స్‌గా వచ్చాయి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఇక్కడ ఆమె తప్పు చేసిందా? లేదా? అనేది ప్రశ్న కాదు. ఆమె ఇప్పుడు హాలీవుడ్ నటే అయివుండవచ్చు. మోదీని కలిసింది విదేశాలలోనే అయి ఉండవచ్చు. కానీ ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా..నీ తల్లి భూమి భారతిని.. అన్నట్లుగా మన మూలాలు, సంప్రదాయాలు మర్చిపోకూడదు. ప్రపంచమంతా భారతదేశంలోని నైతిక విలువల గురించి గొప్పగా చెప్పుకుంటూ, మనలను అనుసరించే ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం పాశ్యాత్యపోకడల్లో పడిపోవడం సమంజసం కాదు.
ఇక్కడ ప్రతి వ్యక్తికి తనకి నచ్చిన దుస్తులు, తనకు నచ్చిన ఆహారం, తనకు నచ్చిన మతం పుచ్చుకునే స్వేచ్చ ఉండవచ్చు. కానీ వాటిని దుర్వినియోగం చేయకూడదు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో మన దేశం వారిని కూడా ముస్లింలు అనుకుని కాల్చిచంపుతూ, జాత్యహంకారం చూపిస్తుంటే మన పెద్దలు చేసిన విన్నపం ఏమిటంటే.. బయటకు వెళ్లేటప్పుడు చీరలతో, నుదుటున బొట్టుతో మేము భారతీయులం అనే విధంగా కనిపించాలి.. అని సెలవిచ్చిన సంగతి మరువరాదు. ఇక తమిళనాడు రైతుల కష్టాలను, ఇతరుల అనేక కష్టాలను వినడానికి సమయంలేని మోదీ దేశానికి ముఖ్యమైన విదేశీ మంత్రాంగం కోసం విదేశాలలో పర్యటించేటప్పుడు తన విలువైన సమయాన్ని ఇలా ప్రియంకా చోప్రాలకు, సన్నిలియోన్‌లకు కేటాయించడం చాలా తప్పు...!