తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగిన సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీఆర్‌ఎస్ పై తీవ్రంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. బంగారు తెలంగాణ కోసం తాము ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. వంశపాలన కోసం, వారసత్వ రాజకీయాల కోసం తాము ప్రత్యేక తెలంగాణ ఇవ్వలేదని, బంగారు తెలంగాణ కోసమే మేము ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. 350 కోట్లతో కేసీఆర్ సొంత ఇళ్లు కట్టుకున్నాడని, ఆయన మేడలు, మెద్దెలే కట్టేందుకు తెలంగాణ రాలేదని, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇలా పలు అంశాలపై రాహుల్‌గాంధీ కేసీఆర్ కుటుంబంపై, ఆయన పరిపాలనపై ధ్వజమెత్తారు.
దానికి కేసీఆర్ తనయుడు, ఐటి మంత్రి కేటీఆర్ ఓ రేంజ్‌లో విరుచుకుపడి, రాహుల్‌గాంధీని ఉతికి ఆరేశాడు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే తనకు నవ్వోస్తోందని, నెహ్రూ. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా సాగుతున్న కాంగ్రెస్ ప్రస్తానం గురించి అందరికీ తెలుసునని, ఆయన తమను కుటుంబపాలన అని నిందించడం చూస్తే ఇది మిలీనియం జోక్‌గా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రేస్ పార్టీ అని, స్కాంగ్రేస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? దానిని మేము నమ్మాలా? అవినీతి గురించి స్కాం లీడర్లు మాట్లాడటం ఏమిటని ఎద్దేవా చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్‌కు నమ్మకం లేదని, ఇందిరా గాంధీ నాటి ఎమర్జెన్సీని ఎవ్వరూ మర్చిపోరని, లోకల్‌గా ఎక్కడా గెలవలేని నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ బహుపసందుగా చదివారని, తమ లోకల్ రాష్ట్రాలలో కూడా దిక్కులేని నాయకులు, గెలవలేని, తమ పార్టీని గెలిపించుకోలేని నాయకులు తెలంగాణకు వచ్చి టీఆర్‌ఎస్ పై ధ్వజమెత్తడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. ఇలా రాహుల్‌ను కేటీఆర్ ధీటుగా ఎదుర్కొని సమాధానం ఇచ్చాడని టీఆర్‌ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.