తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య, పేదలకు, దళితులకు మూడెకరా భూముల పంపిణీ, అవినీతి, తెలంగాణ అమర వీరులకు ఇంకా న్యాయం చేయలేకపోవడం, నియంతృత్వ వైఖరి, కుటుంబ పాలన, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనైతికంగా పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కిస్తున్న తీరు... తాగు, సాగునీటి సమస్యలు, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. వంటి అనేక వ్యతిరేకతలు ఉన్నా కూడా విపక్షాల వైఫల్యం.
ఇప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై సామాన్య ప్రజానీకానికి ఉన్న నమ్మకం వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ టీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. దీంతో బీహార్ తరహాలో మహాకూటమిని ఏర్పాటు చేసి, విపక్షాల ఓట్లు చీలిపోకుండా చూడాలని, బీహార్‌లో బిజెపిని మట్టుపెట్టేందుకు తన బద్ద విరోధి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌తో నితీష్ కుమార్ జతకట్టి బిజెపిని ఓడించిన సూత్రాన్ని నిజం చేయాలని తెలంగాణలోని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకు తాము కాంగ్రెస్‌తో నైనా కలిసి పోరాడటానికి సిద్దంగా ఉన్నామని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించడం, దానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కూడా అంగీకారం తెలపడం, తెలుగుదేశాన్ని తాము అంటరానిపార్టీగా చూడటం లేదని చెప్పడంతో నిన్నమొన్నటి దాకా తెలంగాణలో మహాకూటమి ఏర్పడే సూచనలు స్పష్టంగానే కనిపించాయి.
ఇక టీఆర్‌ఎస్, బిజెపిలు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపాయి. ఇక తాజాగా టిడిపితో కాంగ్రెస్ జత కట్టే పరిస్థితే లేదంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ తేల్చేశారు. తాము ఏపీలో టిడిపికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, మరి తెలంగాణలో మేము టిడిపితో జత ఎలా కడుతామని ఆయన ప్రశ్నించారు. అసలు టిడిపి, కాంగ్రెస్‌లు కలిసి పనిచేస్తాయని చెప్పడానికి స్థానిక నాయకులు ఎవరు? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ని నేనే కదా...! నేను కాకుండా ఎవరో ఈ మాటలను ఎలా చెబుతారని ఆయన అన్యాపదేశంగా జైపాల్‌రెడ్డిపై కామెంట్ వేశారు. మొత్తానికి విపక్షాల మహాకూటమి ఆశలకు డిగ్గీ బ్రేక్‌లు వేశాడు. కానీ కొందరు మాత్రం డిగ్గీకి కేంద్రంలో విలువలేదని, వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు.