నేడున్న నిర్మాతల్లో ముందుచూపు, సినిమాలపై ప్యాషన్, సినిమాపై పట్టు ఉన్న నిర్మాత ఎవరంటే ఠక్కున దిల్‌రాజు పేరే చెబుతారు. సినిమా నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయనది లక్కీ హ్యాండ్. దాంతో తమ చిత్రాన్ని దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక తమ చిత్రం బ్లాక్‌బస్టరేనని ఆయా చిత్రాల నిర్మాతలు గుండెల మీద చేయ్యేసుకుని హాయిగా నిద్రపోతారు. ఆయన నైజాంకు గానీ, లేదా వైజాగ్‌కి గానీ డిస్ట్రిబ్యూట్ చేస్తే మిగిలిన ఏరియాల హక్కులు కూడా భారీ రేట్లకు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయనేది నిజం.
ఇక ఈ ఏడాది దిల్ రాజు ఇప్పటికే నిర్మాతగా శర్వానంద్‌తో 'శతమానం భవతి', నానితో 'నేను లోకల్'లతో పెద్ద హిట్లు కొట్టాడు. ఇక నాగార్జున- రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో వచ్చిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ఆయనకు నష్టాలు తెచ్చింది. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్'ను పలు కారణాల వల్ల ఆయన వదిలేశాడు. ఇక ఈ ఏడాది ద్వితీయార్దంలో కూడా దిల్‌రాజు చక్రం తిప్పడం ఖాయమంటున్నారు. ఇప్పటికే మురుగదాస్-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్' హక్కులను ఆయన 26కోట్లకు సొంతం చేసుకున్నాడంటున్నారు. ఇక పవన్-త్రివిక్రమ్-రాధాకృష్ణల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రాన్ని కూడా ఆయన 30కోట్లు కేటాయించి రైట్స్ తీసుకునే యోచనలో ఉన్నాడట.
ఎన్టీఆర్-బాబి-కళ్యాణ్‌రామ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'జై లవ కుశ' కోసం కూడా ఆయన్ను కళ్యాణ్‌రామ్ అడిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తానే నిర్మాతగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో నిర్మిస్తున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథమ్), నానితో 'ఏంసీఏ', రవితేజతో 'రాజా దిగ్రేట్', శేఖర్ కమ్ముల-వరుణ్ తేజ్‌ల 'ఫిదా', సాయి ధరమ్ తేజ్ చిత్రం... ఇవ్వన్నీ కలిపితే కేవలం నైజం పరంగానే దిల్‌రాజు 100కోట్ల బిజినెస్‌ను టర్నోవర్ చేయనున్నట్లు అర్దమవుతోంది.