నిన్నటి వరకు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా పెద్దాయన దాసరి వద్దకు వెళ్లేవారు. పరిశ్రమకు మేస్త్రీ అయిన ఆయన తీర్పు చెప్పేవారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తేల్చేవారు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. ఇక కార్మికులు కూడా తమ సమస్యలను దాసరి వద్దకే తీసుకెళ్లేవారు. కాగా దాసరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించే వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజకు పేరుంది.
ఆయన కూడా అందరికి న్యాయమైన తీర్పులు చెప్పే పెద్ద మనిషిగా పేరుతెచ్చుకున్నారు. కార్మిక పక్షపాతిగా పేరుంది. ఇక దాసరి మరణం తర్వాత పరిశ్రమలోని సమస్యలు బయటకు తీసుకెళ్లి నానా హంగామా చేయకుండా కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం తీర్చుకొనే పరిస్థితి ఉందా? ఉంటే దాసరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే అనుమానం పలువురిలో ఉంది. చాలామంది తమ్మారెడ్డినే ఇక సినీ పెద్దగా వ్యవహరిస్తాడని భావించారు. కానీ తాజాగా మెగాబ్రదర్ నాగబాబు ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాసరి తర్వాత పరిశ్రమ పెద్దదిక్కుని కోల్పోయింది. ఇక ఆయన తర్వాత పరిశ్రమకు పెద్దదిక్కుగా వ్యవహరించడానికి మోహన్‌బాబు వంటి వారు ఉన్నారు అని నాగబాబు వ్యాఖ్యానించాడు. దాసరికి కోపం ఉన్నా కూడా తనదైన శైలిలో చూపించి, కోపాన్ని కూడా పొదుపుగా వాడుకునే వారు. కానీ మోహన్ బాబుకు ముక్కుమీదే కోపం ఉంటుంది. మరి మోహన్ బాబు పేరును నాగబాబు తెరపైకి తేవడం ఆశ్యర్యకరమే. దీనిలోని అంతరార్దం ఏమిటబ్బా? అని పలువురు చర్చించుకుంటున్నారు.