తెలుగు నాట పీపుల్స్ స్టార్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి ఓ చక్కటి ఉదాహరణ ఉంది. ఓ శతదినోత్సవ వేడుకలో పలువురు సీనియర్ స్టార్స్‌తో పాటు పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి గురువు దర్శకరత్న దాసరి కూడా ఉన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ ఒక్కో అతిధి పేరు చెబుతుంటే.. అందరూ వేదికపైకి వస్తున్నారు. ప్రేక్షకులు చప్పట్లతో, నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
కానీ ఒక్కసారిగా పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తిని వేదికపైకి పిలిచిన వెంటనే అందరి అభిమానులు, ఆహుతుల చప్పట్లతో వేదిక మారుమోగిపోయింది. అలాంటి నివ్వురుగప్పిన నిప్పు నారాయణమూర్తి. ఆయన తన కమిటెమ్‌ంట్‌తో, ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయితేనే తట్టాబుట్టా సర్దుకొని, తాము తీసిన మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించలేదని, నిర్మాతలుగా కనుమరుగయ్యే వారు, లేదా డబుల్‌మీనింగ్‌లతో, హాట్ సీన్లతో ప్రతీకారం తీర్చుకునే నిర్మాతలు, దర్శకులు ఉన్న ఈ రోజుల్లో కూడా ఆయన తన విప్లవబాటలోనే నడుస్తున్నాడు.
కాగా తాజాగా ఆయన మాట్లాడుతూ, నాకు మహాకవి శ్రీశ్రీ రాసిన 'మహాప్రస్ధానం' భగవద్గీత వంటిది. నాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిజం భావాలు ఎక్కువ అని తెలిపాడు. ఇక తనను మూడుసార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీటు ఇస్తామని పిలిచినా వెళ్లలేదని, ఒకసారి కాంగ్రెస్, ఇటీవల మరో పార్టీ కూడా తనను రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానించాయని, కానీ తాను ఓ దండం పెట్టానన్నాడు. రాజకీయాలలోకి రావాలంటే 24గంటలు ప్రజాసేవకే సమయాన్ని కేటాయించాలని, అంతేకానీ పార్ట్‌టైం ఉద్యోగంలా దానిని చేయలేమని తెలిపాడు.
నాటి స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ప్రజల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారేనని ఉద్వేగంగా, నిక్కచ్చిగా తెలిపాడు. రెండు పడవల ప్రయాణం చేయాలనుకునే సినీ ప్రముఖులకు, ఇతరులకు ఆర్.నారాయణమూర్తి చెప్పిన మాటలు తలకెక్కుతాయో లేదో వేచిచూడాల్సివుంది..!