ఆర్‌ఎస్‌ఎస్ అంటే అందరికీ రాష్ట్రీయ స్వయం సేవఖ్ సంఘ్‌గానే తెలుసు. కానీ ఇప్పుడు సినిమాలలోగానే ఒకే పేరు మీద ఎన్నైనా అనామక సంఘాలు, సంస్థలు, పార్టీలు వెలుస్తున్నాయి. అలాంటిదే ఈ ఆర్‌ఎస్‌ఎస్. దీని పూర్తి పేరు రాయలసీమ రాష్ట్ర పోరాట సమితి. నిన్నటి దాకా రాష్ట్ర విభజన విషయంలో టిఆర్‌ఎస్ పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలంటూ ఈ సంస్థ లుకలుకలు మొదలుపెట్టింది.
పోను పోను... సమైఖ్యతకు దెబ్బకొట్టే ప్రత్యేక దేశ వాదనలు, ప్రాంతీయ వాదనలు వచ్చే ప్రమాదకర పరిస్థితులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి అనే అనామకుడు జనసేనాని పవన్‌ను రచ్చకీడుస్తూ తన మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో పవన్‌ని పోటీ చేయనివ్వం, అనంతపురం నుంచి పోటీ చేయడానికి నీకేం అర్హతలు ఉన్నాయి? నీవు కోస్తాంధ్రకు చెందిన వాడివి. కాబట్టి అక్కడ పోటీ చేసుకో.. మా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించాడు. మీ అన్న రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేసి డబ్బులకు పార్టీని అమ్ముకుంటే, నువ్వు స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయ మనుగడ కోసం, రాయలసీమ పేరు చెప్పి అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని, పాదయాత్ర చేస్తానని అంటున్నావు.
అవసరం అయితే నరుకుతాం... అంటూ పవన్‌పై దుర్భాషలాడాడు. ఇంతకీ ఈయన మాట్లాడింది కోస్తాంద్రకు చెందిన గుంటురులో. అసలు రజినీ తమిళేతరుడని, పవన్ కోస్తాంధ్ర వాడని... ఇలా చెప్పుకుంటూ పోవడం చాలా దారుణమైన పరిస్థితులకు దారి తీసేలా కనిపిస్తోంది. నాటి కవి 'తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది.. అంటూ తెలంగాణ నాది. రాయలసీమ నాది... నెల్లూరు నాది.. సర్కార్ నాది...' అంటూ నినదించాడు.
కానీ నేడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల పట్ల, ఉత్తరాది, దక్షిణాది, ప్రత్యేక కాశ్మీర్, ప్రత్యేక ఖలిస్తాన్.. ఉద్యమం వంటివి తారాస్థాయికి చేరడం పట్ల మేధావులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ని కావాలంటే విమర్శించవచ్చు కానీ ఆయన్ను కోస్తాంధ్రకు చెందిన వాడిగా చూడటం దారుణం. మరి ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ వాడే. ప్రతిపక్ష నేత జగన్ రాయలసీమ వాడే. మరి వారినేమంటావు రెడ్డిగారూ....!