తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ఏపీలో అధికారంలో ఉన్న టిడిపిలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పక్క పార్టీల ఎమ్మెల్యేలకు వల వేసి తమ పంచన చేర్చుకున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కేంద్రం తమకు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన చేస్తుందని, కాబట్టి మొదటి నుంచి తమ పార్టీలో ఉన్న వారికే కాక ఇతర ఎమ్మెల్యేలకు కూడా పెరిగే సీట్లను బట్టి సీట్లు ఇవ్వవచ్చని అవి భావిస్తున్నాయి. నిన్నమొన్నటి దాకా కేంద్రంపై టీడీపీ, టీఆర్‌ఎస్‌లు మెతకగా ఉండటానికి, కేంద్రంతో ఏమాత్రం తేడాలు రాకుండా చూసుకుంటూ రావడానికి ఇది కూడా ముఖ్యకారణం.
ఇక తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పోటీగా ఎదిగి, ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండా విజయం సాధించేలా చూడాలని స్థానిక నాయకులకు ఆదేశించారు. మరోపక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చాడు. దానికి కేసీఆర్ జవాబిచ్చాడు.ఇక అమిత్‌షా ఏపీకి వచ్చినప్పుడు కూడ చంద్రబాబు ఆయనతో నియోజక వర్గాలను పెంచేలా చూడాలని కోరాడట. ఇక నుంచి తమ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు బిజెపి మీద విమర్శలు చేయకుండా చూసుకుంటానని కూడా హామీ ఇచ్చాడంటున్నారు.
అదే సమయంలో స్థానిక బిజెపి నాయకులు మాత్రం సీట్ల పెంపు వల్ల తెలుగుదేశంకు తప్ప మనకేమీ ఉపయోగం లేదని, టిడిపి నాయకులు మిత్రపక్షం అని కూడా చూడకుండా మోదీ నుంచి అందరినీ విమర్శిస్తున్న విషయాన్ని అమిత్‌షా చెవిన వేశారు. సో.. ఈ ఇద్దరు చంద్రులను దారిలోకి తెచ్చుకోవడానికి నియోజక వర్గాల పునర్విభజన విషయంలో ఆలస్యం చేయడమో, పునర్విభజన ఇప్పుడే చేయకపోవడమో మంచిదనే నిర్ణయానికి వచ్చిన అమిత్‌షా ఇదే విషయాన్ని మోదీకి విన్నవించేందుకు రెడీ అయ్యాడంటున్నారు.