అన్ని చిత్రాలు 'బాహుబలి'లు కాలేవు. అలాగే 'మగధీర, అత్తారింటికిదారేది, జనతా గ్యారేజ్, సరైనోడు. ఖైదీ నెంబర్ 150' లు కూడా కాలేవు. సినిమా విడుదలయ్యే సమయం, పోటీగా ఉన్న చిత్రాల స్థితిగతులు, సినిమాలకు వచ్చే టాక్‌ని బట్టి అవి వస్తుంటాయి. యావరేజ్ సినిమాలైన 'జనతా గ్యారేజ్, సరైనోడు, ఖైదీ నెంబర్ 150'లు విడుదలైనప్పుడు ఆ రేంజ్ హిట్లు, కలెక్షన్లు సాధిస్తాయని ఎవ్వరూ ఊహించలేదు.
కానీ అది ప్రాప్తం. కానీ వాటిని ఉదాహరణగా తీసుకుని వారి తర్వాతి చిత్రాలను కొంటే వీదుల్లో బయ్యర్లు టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు తప్పవు. యావరేజ్ టాక్ వచ్చిన చిత్రాలే ఇంత బిజినెస్ చేస్తే మా చిత్రం ఖచ్చితంగా సూపర్‌హిట్, దానికి మరెంత కలెక్షన్లు వస్తాయో చూడండి అని నిర్మాతలు బయ్యర్లకు చెప్పడం బిజినెస్‌లో భాగం. ఆ రేటుకు కొనడం సరైనదా? గ్యాంబ్లింగా? అనేది బయ్యర్లే చూసుకోవాలి.
ఎన్టీఆర్‌కు నిన్న మొన్నటి వరకు ఓవర్ సీస్‌లో మార్కెట్ లేదు. మెల్లగా 'నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్'లతో ఓకే అనిపించుకున్నాడు. తాజాగా ఆయన బాబి దర్శకత్వంలో నటిస్తున్న 'జై లవ కుశ' ఓవర్ సీస్‌ను ఏకంగా 14కోట్లకు పైగా కొన్నారని టాక్. ఈ చిత్రానికి ఎన్టీఆరే పెద్దదిక్కు. కళ్యాణ్‌రామ్ విన్నింగ్ ప్రోడ్యూసర్ కాదు. బాబి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అసలే కాదు. నిజంగా 'జై లవ కుశ'ను ఆ రేటుకు ఓవర్ సీస్ రైట్స్ కొని ఉంటే కనీసం అక్కడ 3మిలియన్ డాలర్లను అది వసూలు చేయాల్సివస్తుంది.
మరోపక్క 'సరైనోడు'తో పాటు వరుస హిట్స్‌లో ఉన్న బన్నీ, దిల్ రాజులు ప్లస్‌గా భావించి 'డిజె' చిత్రాన్ని కూడా ఏకంగా 14కోట్లకు సీడెడ్ రైట్స్‌ని సీనియర్ అయిన ఎన్వీ ప్రసాద్ కొన్నాడట. అనూహ్యంగా హిట్టయిన 'సరైనోడు' అక్కడ వసూలు చేసిన గ్రాస్ ౧౭ కోట్లకు అటు ఇటుగానే ఉంది. మరి ఈ బయ్యర్లు ఎందుకు గ్యాంబ్లింగ్ చేస్తారో తెలియదు. పోనీ ఆ తర్వాత నష్టాలు వస్తే ఊరుకుంటురా? అంటూ ఊరుకోరు. హీరోలను, నిర్మాతలను అందరినీ వివాదాలలోకి లాగుతారు? మొత్తానికి అందరూ కలిసి సినీ ఇండస్ట్రీని ఓ జూదకేంద్రంగా మారుస్తున్నారు.