సంగీత ప్రపంచంలో ఎందరో మహారాజులు, లెజెండ్స్ ఉన్నారు. దశాబ్దాలకు దశాబ్దాలు ఏలినవారున్నారు. కానీ నేటితరంలో మాత్రం మహామహులకు కూడా దశాబ్దం పూర్తి చేయడమే పెద్ద కష్టమైపోతోంది. కానీ మణిశర్మ, కీరవాణిలతో పాటు రాజ్‌కోటి వంటి వారు రాజ్యమేలుతున్న సమయంలో అతి పిన్న వయసులో 'దేవి' ద్వారా సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే టాప్‌కి చేరుకున్నాడు.
ఇక ఒక్కసారి టాప్‌లీగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత దేవిశ్రీని ఆపడం ఎవ్వరి వల్లా కాలేదు. ఎందరో సంగీత దర్శకులు వస్తున్నారు. తమన్, రాధాకృష్ణన్, మిక్కీ జెమేయర్, అనూప్ రూబెన్స్, .. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఇక తమిళ సంగీత దర్శకులైన అనిరుద్, హరీస్‌జైరాజ్‌లు కూడా మరలా మన చిత్రాలపై కన్నేశారు. కానీ మన రాక్‌స్టార్ మాత్రం ప్రతి టాప్ హీరోకి ఫస్ట్‌చాయిస్ అంటే అతిశయోక్తి కాదు.
కొందరు చాలా కాలం సంగీత ప్రపంచాన్ని ఏలినా కూడా వారి ట్యూన్స్ వింటుంటే ఎక్కడో ఇంతకు ముందే విన్నట్లు, తమ సంగీతాన్ని తామే కాపీకొట్టుకునే సంగీత దర్శకులకు కూడా కొదువ లేదు. ఇక తమన్- దేవిశ్రీకి చెక్‌పెడతాడని కొందరు వాదించారు. అది జరిగే పనికాదని తేలిపోయింది. ప్రస్తుతం దేవిశ్రీ యమాబిజీగా ఉన్నాడు. రేపు విడుదలకు సిద్దమవుతోన్న నాగచైతన్య-కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్‌లో నాగార్జున తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పి మరీ విడుదల చేస్తున్న చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'. ఈ చిత్రంలోని అన్ని పాటలు ముఖ్యంగా భ్రమరాంభ, టైటిల్ సాంగ్స్ ఓఊపు ఊపుతున్నాయి.
ఇక త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న బన్నీ-హరీష్ శంకర్-దిల్‌రాజుల 'డిజె'లో ఇటీవల విడుదలైన 'భజే భజే' ఓ మోత మోగిస్తోంది. వీటితో పాటు ఎన్టీఆర్-బాబి, చరణ్-సుకుమార్, మహేష్-కొరటాల, రామ్- కిషోర్ తిరుమల, నితిన్, నాని.. ఇలా అందరూ హీరోలు ఈయనే కావాలంటున్నారు. ఎన్ని సినిమాలు చేసినా పోస్టర్‌పై డిఎస్‌పి అనే ముద్ర, అన్నింటికీ న్యాయం చేయడం చూస్తే దేవిశ్రీ సవ్యసాచి అనిపించకమానదు.