తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆయన స్థాయిలో ఫాలోయింగ్, వాగ్దాటి, పంచ్‌లు, అద్భుతమైన అనర్గళ ప్రసంగ చాతుర్యత, ఏ విషయంపైనైనా వివాదాలకు తావులేకుండా మాటలు, సమాధానాలు చెప్పగలిగిన నేర్పరి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అనేది వాస్తవం. ఇక యంగ్‌టైగర్‌ను నిజ జీవితంలో రాజకీయాలలోకి రాకుండా అడ్డుకుంటున్న వారు ఎవరో అందరికీ తెలుసు.
బహిరంగంగా చెప్పాలంటే తన కొడుకు లోకేష్ కోసం చంద్రబాబునాయుడు, తన అల్లుడు లోకేష్ కోసం బాలయ్యలు ఎన్టీఆర్‌ను రాజకీయంగా దూరం పెడుతున్నారు. కానీ ఎన్టీఆర్ రేంజ్ మాత్రం వారి వలన తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. ఇక త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబి 'జై లవ కుశ'లోనూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్-యంగ్‌టైగర్‌ల చిత్రం ప్రారంభం కానుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ నేటి రాజకీయాలను ప్రతిబింబించేలా, ఓ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఇరగదీసే పొలిటికల్ సెటైరిక్ కథను రెడీ చేశాడట. ఇందులోని డైలాగులు ఎన్టీఆర్ నోటి వెంట వస్తేనే వాటికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు పొలిటికల్ మైలేజ్‌ను ఇచ్చే విధంగా ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ కలం నుంచి వచ్చే పవర్‌ఫుల్ పొలిటికల్ సెటైరిక్ డైలాగులను ఎన్టీఆర్ నోటి వెంట వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.