సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణ ముఖ్యం. ముఖ్యంగా టాలీవుడ్‌ని క్రమ శిక్షణకు మారుపేరుగా చెబుతారు. కానీ కొందరు హీరోలు మాత్రం దీనికి మినహాయింపు. 7గంటలకు షెడ్యూల్ అంటే లంచ్ తర్వాత వస్తారు. వారిలో ముఖ్యులుగా రాజశేఖర్, అల్లరి నరేష్‌లను చెప్పవచ్చు. వ్యక్తిగతంగా ఈ ఇద్దరు మంచి వ్యక్తులే అయినా నిర్మాతలకు మాత్రం వీరితో తలనొప్పే.
కాగా ఇటీవల రాజశేఖర్ తన నిర్మాతలకు తాను ఇక నుంచి చెప్పిన సమయానికి వస్తానని చెబుతున్నాడట. కానీ 'గరుడ' చిత్రంలో కూడా ఆయన వరస అలానే ఉందంటున్నారు. ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే ఆయనది కూడా ఇదేపోకడ. మినిమం గ్యారంటీ హీరోగా, రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని ఆక్రమించే సత్తా ఉన్న నటునిగా అతనికి పేరుతో పాటు మంచి విజయాలు కూడా వచ్చాయి.
కానీ ఈమధ్య మరీ ముఖ్యంగా ఆయన తండ్రి ఇవివి సత్యనారాయణ మరణం తర్వాత అల్లరోడుకి జడ్జిమెంట్ తెలియడం లేదు. దాంతో గత నాలుగైదు సంవత్సరాలుగా వరుస పరాజయాలే. 'సుడిగాడు' తర్వాత మంచి హిట్ లేదు. దీంతో రాజ్ తరుణ్ వంటి వారు, లేడీస్ టైలర్ కొడుకుగా అల్లరోడిని పెట్టుకోవాలని చూసిన వారు రాజ్ తరుణ్ ఒప్పుకోకపోయే సరికి సుమంత్ అశ్విన్‌తో బండి లాగిస్తున్నారు.
కానీ నరేష్‌లో పెళ్లయిన తర్వాత తండ్రి అయిన తర్వాత చాలా మార్పు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మేడ మీద అబ్బాయి చిత్రంలో నటిస్తున్నాడు. వీరిని చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనిపిస్తోంది.