తాజాగా కర్నూల్ జిల్లా వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సినిమా ఫక్కీలో పక్కాగా సాగిన ఈ హత్యతో మరలా కర్నూల్‌తో పాటు రాయలసీమ జిల్లాలలో ఫ్యాక్షన్ నీడలు భారీగా కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయాన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడికి ఈ హత్యతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నెత్తుటి సీమగా, ఫ్యాక్షన్‌కి పట్టుగొమ్మలుగా నిలిచే రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్యలు జడలు విప్పుకునే ప్రమాదం ఉంది.
రాష్ట్రాన్ని సుఖశాంతులు, గొడవలు లేకుండా ప్రశాంతంగా పాలిస్తున్నామని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పురివిప్పిన ఫ్యాక్షనిజాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నామని చంద్రబాబు చెప్పే మాటలు కేవలం మాటలకే పరిమితమైపోయాయి. ఇక తాజాగా బిజెపి నాయకురాలు పురందేశ్వరి ఈ హత్యపై మండిపడ్డారు. రేపు ప్రతీకార హత్యలు మొదలైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంతో కూడిన ఫ్యాక్షన్ రాజకీయాలు మరలా ఇప్పుడు మొదలయ్యాయని తీవ్రంగా దుయ్యబట్టారు.
స్వయాన టిడిపి మిత్రపక్షమైన బిజెపి నాయకురాలు, ఎన్టీఆర్ తనయ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలుగు తమ్ముళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందనే చెప్పాలి. ఇక పోను పోను విజయవాడ, అమరావతి, గుంటూరు జిల్లాలకు కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు పాకడం దురదృష్టకరమనే చెప్పాలి.