తమిళనాడులో తైలావా రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఇంకా జరగనప్పటికీ ఇప్పటికీ అదే పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక డీఎండీకే వ్యవస్థాపకుడు, నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన రజినీ పొలిటికల్ ఎంట్రీని లైట్‌గా తీసుకున్నాడు. భారత ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయాలలోకి వచ్చి, పార్టీలను పెట్టే స్వేచ్చ ఉందన్నారు. కానీ రాజకీయాలంటే ఆషామాషీ కాదన్నాడు.
రజినీ వల్ల తనకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని, తన నాయకులు, తన కార్యకర్తలు ఎప్పటికీ తన వెంటే ఉంటారని సెలవిచ్చాడు. తమిళనాడు రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయన్నాడు. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఒక్కరికి ఒక్క ఓటు వేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు పుట్టుకుని వచ్చారని ఎద్దేవా చేశాడు. ఇక తాజాగా నటి కస్తూరి రజినీపై పేరు ఎత్తకుండా సెటైర్లు వేసింది. దశాబ్దాలకు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అని స్వంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్న వ్యక్తి రేపు రాజకీయాలలోకి వచ్చినా నిర్ణయాత్మక నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించింది.
వస్తున్నా.. వస్తున్నా అని చెబుతున్న వ్యక్తి ఇలా సాగదీయడం ఏమిటంది? రాజకీయాలలో వేగంగా మంచి నిర్ణయాలను డేర్‌గా, స్వంతంగా తీసుకునే లక్షణాలుండాలని రజినీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇలా తమిళనాడు రాజకీయాలు రాజకీయ నిర్ణయాలతోనే కాదు. మాటలతో కూడా వేడెక్కుతున్నాయి.