అసలు ఏపీ ప్రతిపక్షనేత జగన్ ప్రధాని మోదీని కలవడం, మోదీ జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో తప్పేముందని, దానిని టిడిపి రాద్దాంతం చేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
గతంలో మోదీని చంద్రబాబు మతోన్మాది అని, రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వమని చేసిన ప్రకటనను తేదీతో సహా గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న అవినీతి, ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబులో మోదీ అంటే భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు. గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానిని ప్రతిపక్షనేత చంద్రబాబు కలిసి పరిస్థితి వివరించలేదా? మరి ఇప్పుడు జగన్ మోదీని కలిసి విభజన హామీలు, రాజధాని వంటి విషయాలు చర్చిస్తే తప్పేముందని ఘాటు విమర్శలు ఎక్కుబెట్టారు, టిడిపిపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న ఇంటూరి రవికిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎలా పెడతారని, తాను కూడా టిడిపి పాలనను తప్పు పడుతూ సోషల్‌మీడియాలో పలుసార్లు స్పందిస్తున్నానని, దమ్ముంటే తనపై కేసు పెట్టాలని ఆయన టిడిపి ప్రభుత్వానికి సవాల్ చేశారు.
వాస్తవానికి ఎన్నికలకు ముందే మోదీ వంటి ప్రధాని దేశానికి అవసరమని, ఆయనకు తమ మద్దతు అవసరం లేదని, ఏపీకే మోదీ అవసరం చాలా ఉందని జగన్... చంద్రబాబు కంటే ముందుగానే ప్రకటించిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. మొత్తానికి ఉండవల్లి దెబ్బకు టిడిపి నాయకులు ఆత్మరక్షణలో పడ్డారనే చెప్పవచ్చు. కానీ టిడిపి నాయకులు మాత్రం ఉండవల్లి వైసీపీలోకి వెళ్లాలని కోరుకుంటున్నాడని, దానికోసమే జగన్‌ను వెనకేసుకొస్తున్నారని చెబుతున్నారు.