వయసులో చిన్న వాడైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాటల్లో మహా నేర్పరి. ఇక తాజాగా విడుదలైన 'జై లవ కుశ' ఫస్ట్‌లుక్‌లో కూడా ఆయన రాజసంగా, రాయల్ లుక్‌లో, ప్రజలకు ఏదో సందేశం ఇస్తూ, అభివాదం చేస్తున్ననట్లుగా ఉంది. దీంతో ఈ చిత్రంలో పొలిటికల్, లీడర్ యాంగిల్ కూడా ఉందని అర్ధమవుతోంది. మరోవైపు ఆయన ఏబీఎన్‌లో ఓపెన్ విత్ ఆర్కేలో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో ఆయన చాలా తెలివిగా సమాధానాలు చెప్పినట్లు కనిపిస్తున్నాడు.
ముఖ్యమంత్రి విషయం గురించి మాట్లాడుతూ, నిజం సార్... ఇప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు. సీఎం కావడం ఈజీ కాదు. నిజంగా ఆ ఆలోచన వస్తే మీకే ఫోన్‌చేసి మంచిదా? కాదా? అని అడుగుతానని చెప్పాడు. ఇక సినిమాలు తనకు బతుకుదెరువని, రాజకీయాలు బాధ్యతగా చెప్పుకొచ్చాడు. తన మావయ్య (చంద్రబాబు) నాతో చాలా బాగా ఉంటారు. ఆయన సమర్ధుడైన నాయకుడు, నాకు గతంలో పెద్ద బాధ్యతలను అందించాడని చెప్పాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ బోళామనిషి అని, అద్భుతమైన వ్యక్తి అని పొగడ్తలుగుప్పిస్తూ తనకు చంద్రబాబు, బాలకృష్ణల మధ్య విభేదాలే లేవని చెప్పక చెబుతూనే, వారిని మరింత మంచి చేసుకునే ప్రయత్నం చేశాడు.
గతంలో ఎన్నికల ప్రచారంలో నా వంతు బాధ్యత నేను పోషించాను, ఎక్కడ ఓట్లు పడ్డాయి.. ఎక్కడ ఓట్లు చీలాయి? అనే అంశాలు నాకు తెలియదు. అయినా ఒక్క ఓటమితో టిడిపి ఏమీ కాదు కదా...! అన్నాడు. ఇక తాను తన తాతయ్య పెట్టిన బిక్షతో బతుకుతున్నానని, ఆయన స్థాపించిన పార్టీ కోసం ఏదైనా చేయడానికి సిద్దమని సమాధానం ఇచ్చాడు. ఇక తాతయ్యను పదవి నుంచి తప్పించడంపై మాట్లాడుతూ, అప్పటికీ నేను చిన్నపిల్లాడిని, అయినా కార్యకర్తలంతా కలిసి ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మామూలేనన్నాడు. ఇక తాను, కళ్యాణ్‌రామ్, తారకరత్న, హరికృష్ణ, బాలకృష్ణ.. ఇలా అందరం తెలుగు దేశానికి ఆస్తులని చెప్పాడు.