మెగా స్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా 10ఏళ్ల తర్వాత తీసిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'కి పరుచూరి బ్రదర్స్‌తో పాటు వినాయక్ శిష్య బృందం, సాయి మాధవ్ బుర్రా వంటి అనేకులు సంభాషణల నుంచి ప్రతి విషయంలోనూ పాలుపంచుకున్నారు. దానివల్ల మంచి ఎఫెక్ట్ వచ్చింది. చిత్రం ఘన విజయం సాధించింది. గతంలో ఓ సారి స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఒకే రచయితను పెట్టుకుని ఆయన అడిగినంత, డిమాండ్ చేసినంత ఇచ్చి, ఆయన ఏది చెప్పినా ఓకే అనే బదులు.. ఆ స్టార్ రైటర్‌కిచ్చే మొత్తాన్నే ఓ ఐదారుగురు యువ టాలెంటెడ్ రైటర్స్‌కి ఇస్తే అంత కంటే మంచి అవుట్‌పుట్ వస్తుంది.
కొత్తవారికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది. వారికీ తిండి దొరికినట్లు చేశామన్న సంతృప్తి, ఆ అనుభవంతో ఆ కుర్ర రైటర్లే రేపు స్టార్ రైటర్లుగా ఎదిగినప్పుడు మనకు చెప్పుకోలేనంత ఆత్మానందం కలుగుతాయనేది తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌గా చెప్పుకొచ్చారు. దీనివల్ల బెటర్ అవుట్‌పుట్ వస్తుందని, ఒకే బుర్ర స్థానంలో పది బుర్రలు పనిచేస్తే ఆ అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుందని, ఇది నిర్మాతలకు కూడా మంచి మార్గమని సూచించాడు. కాగా చిరంజీవి తన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్150'లో అదే సూత్రం పాటించాడు.
ఇక ఇప్పుడు ఆయన తన 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' వంటి చారిత్రక చిత్రానికి ఫిక్సైపోయాడు. ఎప్పటి నుంచో ఈ స్క్రిప్ట్‌పై ఆయన పెద్ద తలకాయలైన పరుచూరి బ్రదర్స్ చేత వర్క్ చేయిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి ఆస్దాన రచయితలతో పాటు సాయిమాధవ్ బుర్రా కూడా పనిచేస్తున్నాడు.
మరోవైపు రాజమౌళికి ముఖ్యంగా విజయేంద్రప్రసాద్ దగ్గర రచయితగా ఎలా రాయాలో నేర్చుకుని, ఎనిమిదేళ్ల కిందట అజయ్ హీరోగా వచ్చిన 'సారాయి వీర్రాజు' చిత్ర దర్శకుడు కన్నన్ చేత కూడా కథాపరమైన వర్క్‌ని చిరు చేయిస్తున్నాడు. కన్నన్ రాజమౌళి శిష్యుడుకావడం, ఇప్పటి వరకు రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వారెవ్వరూ దర్శకులుగా క్లిక్ కాలేకపోయినా, రచయితలుగా మాత్రం దుమ్ముదులుపుతారనే అంటున్నారు. మరి పోయే కొద్ది ఈ ప్రాజెక్ట్‌లోకి మరెంత మంది రచయితలు వస్తారో వేచిచూడాల్సివుంది....!