రామోజీరావు తాను కాంగ్రెస్ వ్యతిరేకినని ఎప్పుడో బహిరంగంగా చెప్పేశాడు. దానిని కుండబద్దలు కొట్టినందుకు ఆయన్ను అభినందించాలి. ఇక స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ వరకు ఈనాడు టిడిపి, ముఖ్యంగా ఎన్టీఆర్ వైపే ఉంది. కానీ ఆ తర్వాత లక్ష్మీపార్వతి రాకతో రామోజీ.. చంద్రబాబును భుజం ఎక్కించుకున్నాడు. వీరలెవల్లో ఆయన్ను ఆకాశానికెత్తి కింగ్‌మేకర్ అనిపించుకున్నాడు.
కానీ ఎప్పుడైతే వైయస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాడో ఆయన ఉండవల్లితో పాటు రామోజీని పలు ఇబ్బందుల పాలు చేశాడు. కాగా గత ఎన్నికల ముందు వరకు కూడా రామోజీ ఈనాడు అంటే కేరాఫ్ చంద్రబాబు ఉరఫ్ టిడిపి. కానీ ఎన్నికల తర్వాత రామోజీ రూటు మార్చాడు. చంద్రబాబు కంటే దక్షిణాదిలో స్ధిరపడేందుకు ఇక్కడి స్థానిక మీడియా ఆవశ్యకతను కూడా గుర్తించిన మోదీ తన ప్రమాణ స్వీకారంలో కూడా రామోజీకి పెద్ద పీట వేశాడు. అప్పటి నుంచి ఈనాడు చంద్రబాబు భజన తక్కువ చేసి మోదీ భజన మొదలుపెట్టింది. దీంతో చంద్రబాబు పెంచి పోషించిన రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి టిడిపి పంచన చేరింది. ప్రమాణస్వీకారంలో గానీ ఇతర ప్రకటనల విషయంలో గానీ కేంద్రం ఆంధ్రజ్యోతిని, ఎబిఎన్‌ను పట్టించుకోకపోవడంతో జ్యోతిలో నేడు కరెన్సీ కష్టాల గురించి ఇప్పటికీ నెగటివ్ వార్తలు వస్తున్నాయి.
ఇక రాధాకృష్ణ.. చంద్రబాబుకు సలాం అన్నాడు. దీంతో రాష్ట్రస్థాయిలో చంద్రబాబు ఈనాడు కంటే జ్యోతికి ప్రాధాన్యం ఇవ్వడం, పలు మేళ్లు చేయడం జరుగుతోంది. కానీ ఆమధ్య జగన్ వెళ్లి రాజగురువు కాళ్ల మీద పడ్డాడు. సాక్షి ఒక్కటే తనని రక్షించలేదని భావించి ఈనాడు శరణుజొచ్చాడు జగన్. అప్పటి నుంచి జగన్‌పై ఈనాడులో వ్యతిరేక వార్తలు రావడం తగ్గడంతో పాటు జగన్ ప్రెస్‌మీట్‌లకు ఇతర కార్యక్రమాలకు మంచి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఈనాడులో జగన్‌కు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇలా ఈనాడు. జ్యోతి, సాక్షి.. ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అనిపిస్తోంది.