తెలంగాణలో కూడా రోజురోజుకు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. బంగారు తెలంగాణ కోసం ప్రజలు ఓట్లేస్తే.. దానిని కేసీఆర్ సరిగా నిర్వహించడంలేదని కొందరు మండిపడుతున్నారు. రైతులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. కానీ సరైన విపక్షం తెలంగాణలో లేకపోవడం ఆ పార్టీకి ప్లస్‌గా మారింది. మంచి బలం ఉన్న కాంగ్రెస్, తామే తెలంగాణ ఇచ్చామని చెప్పడంలో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏకడంలో విఫలమవుతోంది.
ఇక బిజెపి కూడా తాము మద్దతు ఇవ్వబట్టే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, మతప్రాదిపదికన రిజర్వేషన్లు తప్పు అని చెప్పడంలో, ఇతర విధాలుగా సత్తా చూపలేకపోతోంది. దీంతో గద్దర్, కోదండరాంతో పాటు తెలంగాణ ఉద్యమ వేదిక నాయకునితో కలిసి 'తెలంగాణ ఇంటి పార్టీ'ని తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ఈ పార్టీ మొదలుకానుంది. ఈ పార్టీలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపిలు తప్ప అన్ని భాగస్వామ్యం అయ్యేలా కనిపిస్తున్నాయి.
మరోవైపు గత ఎన్నికల్లో బిసి నాయకుడైన ఆర్.కృష్ణయ్యను తెలుగు దేశం అక్కున చేర్చుకుని, కాబోయే సీఎంగా ప్రకటించి, బీసీ ఓట్లకు గాలం వేసింది. కానీ అది పారలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కృష్ణయ్య స్వంతంత్రంగానే వ్యవహరిస్తున్నాడు. ఇక బిసీలకు రాజ్యాధికారమే ముఖ్యమని ఈ ఉద్యమనాయకుడు కూడా త్వరలో సొంత పార్టీ పెట్టనున్నట్లు అర్దమవుతోంది. మరి ఇన్ని పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం. మరి వీరందరూ ఒకే తాటిపైకి వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.