బయోపిక్స్‌కి, చారిత్రక ఘటనలతో కూడిన వాస్తవిక చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఆయా చిత్రాలైతే అన్ని భాషల ప్రేక్షకులను అలరించగలవనే నమ్మకం కలుగుతోంది. దాంతో ఆ తరహా చిత్రాలను భారీ బడ్జెట్‌లో పలు భాషల్లో తీయడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. తాజాగా తమిళం ఈలం నాయకుడు, దివంగత ఎల్టీటీటీఈ నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ స్ఫూర్తితో మంచు మనోజ్ హీరోగా 'ఒక్కడు మిగిలాడు' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కథ ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది.
ఇది ప్రభాకరన్ స్ఫూర్తిగా కాకుండా నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని ఎల్టీటీటీఈ ఆత్మాహుతి దాడిలో చంపిన కథతో చిత్రం రూపొందనుంది. ఎ.ఎం.ఆర్ రమేష్ సారధ్యంలో రవికాలే అనే బాలీవుడ్ నటుడు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా రాజీవ్ హత్యను చేధించే సీబిఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. రానా సినిమాలో తన పాత్ర ఎంత ప్రాధాన్యం, ఎంత వైవిధ్యమైందో చూస్తాడే గానీ తాను హీరోనా? విలన్‌నా? సపోర్టింగ్ రోలా? వంటివి ఆలోచించడు.
'బెంగుళూరుడేస్' చేస్తూనే 'బాహుబలి'లో భళ్లాలదేవగా మెప్పించాడు. వెంటనే పాటలు, హీరోయిజం ఏమీ లేని 'ఘాజీ' చిత్రంతో తన సత్తా చూపించాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్‌గా 'నేనే రాజు..నేనే మంత్రి' చిత్రం చేస్తున్నాడు. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్'తో ఆయన క్రేజ్ కూడా అన్ని వుడ్‌లను తాకింది. కాగా ఈ తాజా చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తీయనున్నారని సమాచారం.