గత 15రోజులకు పైగా ఎక్కడ చూసినా 'బాహుబలి' మేనియానే సాగుతోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులతో పాటు చిన్న చీమ కుట్టినా కూడా 'బాహుబలి' వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా హైసెక్యూరిటీ లిస్ట్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మూడు గంటల పాటు 'బాహుబలి-ది కన్‌క్లూజన్'ను వీక్షించడం.. ఆయన సినిమా చూస్తున్నంత సేపు సెక్యూరిటీ కమాండో వెనుకే నిలబడి ఉండటం, వాటిని ఓ జర్నలిస్ట్ ఫొటో తీయడంతో ఇది వైరల్ అయిపోయింది.
ముఖ్యులకు ఇచ్చే ఎర్ర, పచ్చ బల్బులను తీసివేసినట్లే వారికి ఇచ్చే సెక్యూరిటీ విషయంలో కూడా ఇప్పుడు బాహుబలి2 పుణ్యమా అని తీవ్ర చర్చ సాగుతోంది. మరోపక్క సినిమాలు విడుదలైనప్పుడు పైరసీ చేసి సీడీలు అమ్ముకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఏకంగా 'బాహుబలి2'కి సంబంధించిన హెచ్‌డి ప్రింట్‌ను శాటిలైట్ సర్వర్ ద్వారా కాపీ చేసి వారానికి తమకు 15లక్షలు ఇవ్వాలని, 'బాహుబలి2' ఆడుతున్నంతకాలం ప్రతి వారం తమకు 15లక్షలు ముట్టజెప్పాలని ఈ చిత్ర నిర్మాతలతో పాటు బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసిన కరణ్‌జోహార్‌ను సైతం బెదిరించిన వారిని అదుపులోకి తీసుకోవడం.. ఇలా బాహుబలికి సంబంధించిన ఏ వార్త అయినా సంచలనాలకు కేంద్రబిందువుగా, చర్చనీయాంశంగా మారిపోయింది.