పదకొండేళ్ల క్రితం పూరి - మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'పోకిరి' సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అదిగో అప్పటినుండి 'పోకిరి' రికార్డులను బీట్ చెయ్యడానికి స్టార్ హీరోలు చెయ్యని ప్రయత్నం లేదు. ప్రతి ఒక్క హీరో సినిమా పోకిరిని టార్గెట్ పెట్టుకుని తెరకెక్కేవే. కానీ అవేమి 'పోకిరి' రికార్డుల దరి చేరలేదు. అయితే రాజమౌళి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'మగధీర' వచ్చి 'పోకిరి' రికార్డుని బ్రేక్ చేసి మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. రాజమౌళి తీసిన ఆ చిత్రాన్ని బీట్ చెయ్యడానికి చాలా సినిమాలే వచ్చాయి కానీ కుదరక చతికిల పడ్డాయి. మళ్ళీ రాజమౌళి చిత్రమే 'మగధీర' రికార్డులను బ్రేక్ చేస్తుందని ప్రచారం జరుగుతున్నవేళ త్రివిక్రమ్ తీసిన 'అత్తారింటికి దారేది' కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ హిట్ అయ్యింది. అయినా కూడా టాలీవుడ్ హీరోలు 'మగధీర' రికార్డుని బ్రేక్ చెయ్యడానికే కంకణం కట్టుకున్నారు. ఇక మధ్యలో వచ్చిన 'శ్రీమంతుడు, జనతా గ్యారేజ్' లు టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపించాయి.
ఇక పైన చెప్పిన చిత్రాల రికార్డునే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక టాలీవుడ్ ఫిలిం రికార్డులు సృష్టించింది. అది రాజమౌళి ఐదేళ్ల కష్టపడి తెరకెక్కించిన 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం. ఇక ఆ చిత్రం ఇండియాలో రికార్డులు బ్రేక్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం వెనక్కి నెట్టి 1300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం బాహుబలిని బీట్ చేసే చిత్రాలపైనే దృష్టి సారించారు. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు టాలీవుడ్, తమిళ్, మలయాళం, కన్నడ చిత్ర ఇండస్ట్రీలలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించడానికి తెరతీశారు.
ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో చిరంజీవి తన 151 వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం త్వరలో మొదలు పెడతారని ప్రచారం జరుగుతుండగా... చిరు మాత్రం స్క్రిప్ట్ పక్కాగా వుండాలని చెబుతున్నాడట. హిస్టారికల్ సినిమా కనుక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయట. ఆ ఎఫెక్ట్స్ బాహుబలి క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండాలని..... బాహుబలి చిత్రంలా అంతా పర్ఫెక్ట్ గా ఉయ్యాలవాడని తెరకెక్కించాలని.. ఖర్చు విషయంలో అస్సలు వెనుకాడొద్దని చిరు చిత్ర యూనిట్ కి సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంటే ఉయ్యాలవాడకి మొదట అనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు కాస్త ఎక్కువ అవుతుందని అంటున్నారు. అంటే బాహుబలిని బీట్ చేసే దిశగా ఉయ్యాలవాడ తెరకెక్కుతోందని అర్ధమవుతుంది.