ప్రస్తుతం ఉత్తరాది నుండి తన సత్తాను దక్షిణాదిలోనూ విస్తరింపజేసుకోవాలని బిజెపి భావిస్తోంది. దీనికి అనుగుణంగానే తమకు ఎప్పటి నుంచో పెట్టని కోట అయిన కర్ణాటకతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడులపై మోదీ, అమిత్‌షాలు ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. శశికళకు ఎదురు తిరిగి నిలిచిన పన్నీర్‌సెల్వంకు బిజెపి లోపాయికారి మద్దతునిచ్చింది. తమిళనాడునే శాసించే జయలలిత మరణం, శశకళ జైలు జీవితం, కరుణానిధి వయసు మీద పడటం, స్టాలిన్‌కి అంత సీన్ లేకపోవడంతో ఆర్కే నగర్ ఎన్నికలలోనే బిజెపి తన సత్తా చూపించాలని భావించింది.
కానీ దినకరన్ పుణ్యమా అని ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక రజనీకి బిజెపితో వెళ్లాలని ఉన్నా.. కూడా ఆయన ఇంకా దేవుడు ఆదేశించలేదని సినిమా డైలాగులు చెబుతున్నాడు. బిజెపిలోకి వెళ్లితే ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బిజెపిలోని తనని గెలిపించి ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తారా? లేక బిజెపికి మద్దతు పలికినందున తనను కూడా వెలివేస్తారా? సొంతపార్టీ పెట్టే సత్తా తనకు ఉందా? లేదా? అనేవి ఆయన సంశయాలుగా తెలుస్తున్నాయి.
ఇక తాజాగా కమల్‌హాసన్ మాట్లాడుతూ, తమిళనాడు రాజకీయాలలో శూన్యత ఏర్పడిన మాట వాస్తమేనని, కానీ బిజెపి ఎంతగా ప్రయత్నించినప్పటికీ తమిళనాడులో ఆ పార్టీకి ఇంకా అంత సీన్ రాలేదని కమల్‌హాసన్ తేల్చేశాడు. తమిళనాడు పరిస్థితులు బిజెపి అనుకూలిస్తాయా? లేదా? అనేది చెప్పలేనని, కానీ ఆపార్టీకి తమిళనాడులో ఇంకా అంత సీన్ రాలేదని ఆయన వ్యాఖ్యానించాడు. తమిళనాడు రాష్ట్రంలో కేంద్రం పెత్తనం పెరుగుతోందనే దానికి సమాధానంగా తమిళనాడు ఇండియాలో ఓ భాగమని, దాని అభివృద్దిలో ఎవరైనా భాగస్వాములు కావచ్చని తన జాతీయ వాదాన్ని చాటాడు. మొత్తానికి బిజెపికి అంత సీన్ రాలేదని కమల్ కూడా రజనీకి ముందస్తు సూచనలు చేసినట్లుగా భావించాలి...!