ఫ్యాక్షన్ చిత్రాలకు తెరతీసిన హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకడు. కాగా ఆయన గతంలో 'అశోకచక్రవర్తి', 'యువరత్న రాణా' వంటి చిత్రాలలో మాఫియాడాన్‌గా నటించి ఉన్నాడు. కానీ ఆ రెండు చిత్రాలు ఆయనకు విజయాన్ని అందించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయినా సరే నందమూరి నటసింహానికి మాఫియా, గ్యాంగ్‌స్టర్ పాత్రలపై మమకారం పోలేదు. తన బాడీలాంగ్వేజ్‌కు మాఫియా డాన్ పాత్ర సరిగ్గా యాప్ట్ అవుతుందనేది ఆయన భావన. ఇక మాఫియా, గ్యాంగ్‌స్టర్ పాత్రలను తీర్చిదిద్దడంలో, అలాంటి చిత్రాలను తీయడంలో గురువు రాంగోపాల్‌వర్మని మించిన శిష్యుడు పూరీజగన్నాథ్.
ప్రస్తుతం కెరీర్‌పరంగా ఇబ్బందుల్లో ఉన్న పూరీ ఓ పవర్‌ఫుల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్యను అదరగొట్టేలా చూపడానికి రెడీ అవుతున్నాడు. ఇక రజనీకాంత్ అయితే మాఫియా డాన్‌గా 'బాషా'తో చరిత్ర సృష్టించాడు. ఆయన చేసిన ఈ చిత్రం కథను, ఫార్ములాను బేస్ చేసుకొని ఎందరో స్టార్స్ చిత్రాలు చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఈమధ్య రజనీ మరలా మలేషియాకు చెందిన డాన్ పాత్రలో నటిస్తూ 'కబాలి' చిత్రం చేశాడు. తెలుగులో తప్ప ఈ చిత్రం మిగిలిన భాషల్లో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆయన బాంబేలోని నాటి గ్యాంగ్‌స్టర్ హాజీమస్తాన్ స్ఫూర్తితో రంజిత్‌పా దర్శకత్వంలోనే తన అల్లుడు ధనుష్ నిర్మాతగా త్వరలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈచిత్రం కోసం చెన్నై సమీపంలో ఓ ముంబై సెట్‌ని వేస్తున్నారు.
ఈ చిత్రాన్ని హాజీమస్తాన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తే తాము ఒప్పుకోమని బెదిరింపులు రావడంతో ఈ చిత్రం కేవలం కల్పిత కథ అని యూనిట్ సమాధానం ఇచ్చి వివాదానికి తెరదించింది. ఎవరి ప్రేరణతో ఈ చిత్రం తీసినా టైటిల్ కార్డ్స్‌లో ముందుగా ఈ చిత్రం కథ, ఇందులోని పాత్రలు కేవలం కల్పితం అని వేస్తే ఏమవుతుంది? ఎవ్వరూ ఏమీ చేయలేరు. రజనీ అండ్ టీం కూడా ఇదే ఫార్ములాను ఫాలోకానుందని సమాచారం.