ఎన్ని వాదనలు చేసినా భారతదేశంలో ఉన్నంత వారసత్వ పోకడలు మనకు ఎక్కడా కనిపించవు. ప్రతిరంగంలోనూ వారసత్వమే. ఇక జగన్ కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన సొంతంగా వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీని స్థాపించి అన్నీతానై చూస్తున్నాడు. మరోపక్క దొడ్డిదారిన లోకేష్‌బాబును చంద్రబాబు మంత్రిని చేశాడు. తన తర్వాత తెలుగుదేశం పగ్గాలను ఇతరుల చేతికి వెళ్లకుండా తన తనయుడినే తన వారసునిగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక పవన్ సినిమా స్టార్‌గా వచ్చింది మెగాస్టార్ చిరంజీవి వల్లే. ఆయన రాజకీయ అరంగేట్రం కూడా చిరు స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీతోనే మొదలైంది. ఇప్పుడు స్టార్‌గా మారిన తర్వాత 'జనసేన' అనే సొంత కుంపటి పెట్టాడు. దేశంలో, మరీ ముఖ్యంగా ఏపీలో మేధావులకు, రాజనీతిజ్ఞులకు, మంచి భావాలు, నిస్వార్థ సేవలు అందించే వారు ఎందరో ఉన్నారు. కానీవారెవ్వరూ రాజకీయాలలో ఎదగలేకపోతున్నారు. నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ.. ఇలా దేశ రాజకీయాలు మారుతున్నాయి. అడపాదడపా మోదీ, వాజ్‌పేయ్ వంటి వారు పదవులను అలంకరిస్తూ తమ సత్తా చూపుతున్నారు.
ఇక ఇక్కడ జగన్‌కి ఉన్న పరిపాలనా అవగాహన ఎంత? లోకేష్‌కు ఉన్న గొప్పతనం ఏమిటి? పవన్ రాజకీయ ప్రస్థానం చేయడంతోనే ఆయనకు వస్తున్న హైప్ ఏమిటి? అనేది ఆలోచిస్తే ఏమి గర్వకారణం కనిపించదు. వైఎస్‌రాజశేఖర్ రెడ్డికి ఉన్న సింపతి, రెడ్డి, క్రిస్టియన్ల మద్దతు వంటి వాటితో జగన్ సీఎం కావాలనుకుంటున్నాడు. చంద్రబాబు నీడలో లోకేష్ రాష్ట్రాన్ని శాసించాలని చూస్తున్నాడు. ఇక పవన్‌ది కూడా అదే దారి. వారికి ఉన్నది... మన వద్ద లేనిది.. కేవలం వారసత్వం మాత్రమే అనేది అక్షరసత్యం.