రజినీకాంత్ గతంలో తన సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులను కలుస్తూ వారికి చేరువలో వుండేవాడు. అయితే శివాజీ సినిమా విడుదలైనప్పుడు 2009 లో అభిమాన సంఘాలతో భేటీ అయిన రజినీకాంత్ మళ్ళీ ఇంతవరకు వాళ్ళతో సమావేశాలు నిర్వహించలేదు. అయితే ఈమధ్యన రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై మీడియాలో రకరకాల వార్తలొస్తున్న నేపథ్యంలో రజినీకాంత్ అభిమాన సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించుకుని డేట్స్ కూడా ఫిక్స్ చేసాడు. కొన్ని కారణాల వల్ల అది అప్పుడు క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రజినీకాంత్ అభిమానులతో ఈ నెల 15 నుండి 19 వరకు భేటీ కావాలని నిర్ణయించి వారితో ఈ రోజు సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయన చాలా విషయాలు స్పష్టం చేశారు.
రజినీకాంత్ మాట్లాడుతూ..రాజకీయాల్లోకి రమ్మని అభిమానులు కోరుకోవడం తప్పుకాదు... కానీ నేను రాజకీయాల గురించి 20 ఏళ్ళ క్రితమే స్పష్టం చేశాను... నా పేరును కొన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నా పట్టించుకోలేదు. ఇక నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు... దేవుడికి తప్ప నేను ఎవరికి భయపడే మనిషిని కాదు... నిజంగా ఆ దేవుడు నన్ను రాజకీయాల్లోకి రావాలి అని నిర్దేశిస్తే తప్పకుండా అలాగే జరుగుతుంది. డబ్బుతో ముడిపడిన రాజకీయాలు చేయడం నాకు చేత కాదు. నేనెప్పుడూ నిజాయితీ గానే ఉండాలని దృఢంగా భావిస్తాను. గతంలో ఒక రాజకీయ పార్టీకి మద్దతిచ్చి తప్పుచేశాను...అని రజినీకాంత్ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.
మరి రజినీ ఇలా అభిమాన సంఘాలతో భేటీ వెనుక మర్మం ఏమై ఉంటుందబ్బా అని అప్పుడే అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. ఈ అభిమానుల భేటీని తన రాజకీయ ప్రస్థానానికి ప్లాట్ఫామ్ గా రజిని ఉపయోగించుకుంటాడా? లేకపోతే అసలు ఆయన వంటికి రాజకీయాలు సరిపడవా? అన్నది మాత్రం కొద్దీ రోజుల్లో తేలిపోతుంది.