నేడు టాలీవుడ్‌లో ఉన్న సినీ ఫ్యామిలీలకు కొదువే లేదు. ఒక్కో ఫ్యామిలీ నుండి కనీసం అరడజను మంది హీరోలుంటున్నారు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, బన్నీ, అల్లు శిరీష్, ఇంకా ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసిన అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక.. ఇలా... ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి తీసుకుంటే బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్‌రామ్, తారకరత్న.. ఇలా ఎందరో ఉన్నారు.
అలాగే అక్కినేని, ఘట్టమనేని, మంచు ఫ్యామిలీ సభ్యులకు కొదువ లేదు వీరందరూ కళామతల్లి సేవలో మునిగి తేలుతూ, పునీతులవుతున్నారు. కాగా 'మనం' చిత్రంతో నాగార్జున ఒక కొత్త ట్రెండ్‌కు తెరతీశాడు. తన తండ్రి ఏయన్నార్, తాను, నాగచైతన్య, అఖిల్‌లను కలిపి 'మనం' తీసి బ్రహ్మాండమైన హిట్‌కొట్టాడు. అదే దారిలో మంచు వారు 'పాండవులు పాండవులు తుమ్మెద' తీశారు. మిగిలిన ఫ్యామిలీలు కూడా కలకాలం గుర్తిండిపోయేలా ఫ్యామిలీ అందరూ కలిసి నటించే చిత్రాలను తీయాలని భావిస్తున్నారు.
కానీ అంత మందికి ఒకే చిత్రంలో మంచి ప్రాదాన్యమున్న పాత్రలను సృష్టిస్తూ కథ రాయడ మంటే సులభం కాదు. పోనీ తళుక్కున అందరూ మెరిసేలా చేయాలంటే అభిమానులు ఫీలవుతారు. సో.. రామాయణం, భారతం వంటి వాటిని తీస్తే ఇందులో పదుల సంఖ్యలో కీలకమైన పాత్రలుంటాయి. వాటికి తగ్గట్లుగా తమ ఫ్యామిలీ వారందరికీ అందులో మంచి పాత్రలను ఇవ్వవచ్చు. అలాంటి చిత్రాలను తీసిన ఘనతతో పాటు ఫ్యామిలీ చిత్రాలుగా కూడా ఇవి మిగిలిపోతాయి.
కాబట్టి కొత్త కథల జోలికి పోకుండా త్వరలో 500కోట్లతో అల్లు అరవింద్ రామాయణం తీయనున్నాడు. ఇక మహాభారతం ఎవరు తీస్తారో చూడాలి. మరి 'రామాయణం'ను పూర్తి పౌరాణిక చిత్రంగా తీస్తారా? లేక అవే పాత్రలు, కథలతో సాంఘిక చిత్రాలుగా తీస్తారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో 'మాయాబజార్'నుసైతం సాంఘీకరించి దాసరి ఏయన్నార్‌ని శ్రీకృష్ణునిగా చూపిస్తూ సుమన్ వంటి వారితో 'మాయాబజార్' తీసిన విషయం గుర్తుండే ఉంటుంది..!