సాధారణంగా టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో స్టార్స్ చిత్రాలు కూడా రెండు వారాల పాటు మాత్రమే దడదడలాడిస్తాయి. ఆ తర్వాత షరా మామూలే. కానీ టాలీవుడ్‌లోనే కాదు... బాలీవుడ్‌లో కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' హవా ఇంకా తగ్గలేదు. మూడో వారంలో కూడా ఈ చిత్రం హౌస్‌ఫుల్స్ దిశగానే నడుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. 1500కోట్లకు ఈ చిత్రం చేరువలో ఉంది. ఇక 'బాహుబలి' గురించి నానాపొగడ్తలతో రాజమౌళిని, ప్రభాస్‌ని ఇలా అందరినీ ఆకాశానికెత్తేసిన దర్శకుల్లో వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఒకరు.
'బాహుబలి'కి మామూలుగానే మంచి క్రేజ్ ఉంది. కానీ వర్మ మాటలతో,ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్లను, స్టార్స్‌ని ఘాటు వ్యాఖ్యలతో ప్రభాస్, రాజమౌళిల ముందు తేల్చేసిన వారిలో వర్మ ప్రధముడు. అయితే అనూహ్యంగా ఇప్పుడు 'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రమే వర్మ పాలిట శాపంగా మారింది. రాంగోపాల్ వర్మ -బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ల జోడీకి బాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా 'సర్కార్, సర్కార్‌రాజ్' ల తర్వాత 'సర్కార్3'పై అక్కడ మొదట్లో మంచి ఊపే ఉంది.
కానీ ఈ చిత్రాన్ని కనీసం 4వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని వర్మ భావించాడు. కానీ 'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్స్ అవుతుండటంతో 'సర్కార్3'కి కనీసం 1500 థియేటర్లు కూడా దొరకలేదు. ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పుడే 'బాహుబలి2'ని థియేటర్లలోంచి తీసేయడానికి ఒప్పుకోలేదు.దీంతో తనకు, అమితాబ్‌కు ఉన్న క్రేజ్‌తో మొదటి వారంలోనే నిర్మాతలను సేఫ్‌గా బయటపడేయాలని చూసిన వర్మకు రాజమౌళినే విలన్‌గా మారడం యాదృచ్చికమే.