ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు 25మంది వరకు నక్సలైట్ల దాడిలో వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. కాగా ఈ జవాన్ల పిల్లల చదువు, పెళ్లిళ్లు తదితర బాధ్యతలను క్రికెటర్ గౌతమ్‌గంభీర్ తీసుకున్నాడు. ఇక ఈ జవాన్లకు ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కోట్ల రూపాయల సహాయం చేశాడు. ఇక పెద్దగా హీరోగా ఫేమ్‌లో లేని మరో నటుడు వివేక్ ఒబేరాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని థానేలో ఈ వీరజవాన్లకు ఒక్కొక్కరికి ఒక్కోక్క ఇంటి ప్లాట్‌ను 25మందికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, సీఆర్‌పీఎఫ్ ఆఫీసుకు లేఖ రాశాడు. ఈయనకు కోట్ల సంపాదన ఏమీ లేదు. కాగా ఈయన వర్మ తీసిన 'రక్తచరిత్ర'లో పరిటాల రవిగా నటించి అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న 'వివేగం' చిత్రంలో మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు.
మరోవైపు ఎంతో కాలంగా నటిగా గ్యాప్ ఇచ్చిన జయప్రద ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలల్లో చక్రం తిప్పింది. అమర్‌సింగ్‌కి నమ్మిన బంటుగా పేరుతెచ్చుకుంది. కాగా ఆమె తెలుగులో బాలకృష్ణతో 'మహారథి' చిత్రంలో నటించింది. ఇక ఆమధ్య చాలా ఏళ్ల కిందట ఓ మలయాళ చిత్రంలో నటించింది. తాజాగా ఆమె మలయాళంలో ఆఫ్‌బీట్ చిత్రాలను తీయడంలో నేర్పరి అయిన నిషాద్ దర్శకత్వం వహిస్తున్న 'కిన్నారు' చిత్రంలో ఉచితంగా నటిస్తోంది. కారణం.. ఈ చిత్రం నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, నీటిని దుర్వినియోగం చేయకుండా భావితరాలకు ముప్పు ఏర్పడకుండా ప్రజలను చైతన్యవంతపరుస్తూ తీస్తున్న చిత్రం కావడం విశేషం.