పవన్ ఉత్తరాది.. దక్షిణాది వాదనను పైకి తెస్తున్నారు. ప్రస్తుతం దీనిని చూసి చాలామంది పవన్‌ని తెలివి తక్కువవానిగా చూసి నవ్వుకుంటూఉండవచ్చు. కానీ ఇదే పద్దతులను కేంద్రం పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వాదనకు బలం చేకూరుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం నినాదాన్ని చూసి కూడా ఎంతో మంది ఇది వర్కౌట్ కాదనే అనుకున్నారు. కానీ తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ నినాదాన్ని విత్తు వేసి, మొలక వచ్చేలా చేసి, చివరకు వంగని మహావృక్షాన్ని నాటింది ఆ నినాదమే.
ఇక పవన్ మాటలు చూస్తుంటే పవన్ ఎంతో భవిష్యత్తు దృష్టిలోకి తెచ్చుకుని ఈ వాదనను ఆయుధంగా మలిచాడని అర్ధమవుతోంది. ఇది వెంటనే సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందుకే పవన్ ప్రస్తుతానికి తాను గెలుస్తానని చెప్పడం లేదు అలాగే తనకు అధికార దాహం లేదని అంటున్నాడు. కానీ ఇది ఏదో ఒకనాడు పెద్ద వృక్షమవుతుందని అర్ధమవుతోంది. ఇప్పటికే ఈ వాదనకు రోజు రోజుకు మద్దతుపెరుగుతోంది. ఇక తాజాగా ఓ పెద్ద ఉత్తరాది జర్నలిస్ట్ పవన్ మంచి నటుడే అయినా అతను ఉత్తరాది-దక్షిణాది అనే తేడాను చూపించడం ద్వారా అతనిలో మానవీయ విలువలు కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
మరి ఆనాడు యుపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విడదీసి, ఏపీ ఎంపీలను కూడా మాట్లాడనివ్వకుండా పార్లమెంట్ తలుపులు మూసిమరీ బిల్లుకు ఓకే చేయించుకున్నప్పుడు, చివరకు ఈ గొడవ పెప్పర్‌స్ప్రె దాకా దారితీసినప్పుడు, ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బిజెపి దానిని అమలు చేయనప్పుడు, జయ మరణానంతరం తమిళనాడును కూడా తన కనుసైగలతో శాసిస్తున్న కేంద్రం వైఖరిపై ఈ విలేకరులకు ఆ విషయాలపై స్పందించడం చేతకాదా? ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను విడదీసినట్లుగా విడదీయమనండి చూద్దాం.. నీతులు ఎదుటివారికి చెప్పుకునే ముందు.. ముందుగా తాము ఆచరించి చూపాలని ఈ సోకాల్డ్ ఉత్తరాదికి చెందిన జర్నలిస్ట్‌లు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.