'బాహుబలి' పుణ్యమా అని టాలీవుడ్‌కి మరలా మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక గతంలో బాలకృష్ణ 'భైరవద్వీపం' వంటి జానపద చిత్రాన్ని తీసి విజయం సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత మరో పౌరాణిక చిత్రం తీసి దెబ్బతిన్నాడు. ఇక తెలుగులో రామాయణాన్ని, మహాభారతాన్ని చూపిస్తూ కొన్ని చిత్రాలు వచ్చాయి. బాపుతో పాటు కొందరు ఈ ప్రయత్నాలు చేసి విజయం, అపజయం రెండు సాధించారు.
కాగా 'బాహుబలి1' ఇచ్చిన స్పూర్తితో తెలుగు వీరులైన 'రుద్రమదేవి', 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేయడానికి ముందుకొచ్చిన గుణశేఖర్, క్రిష్ లు విజయం చూశారు. 'శ్రీరామరాజ్యం'కు మంచి పేరు వచ్చింది. బాలయ్య స్వీయ దర్శకత్వంలో చేయాలని భావించిన 'నర్తనశాల' ఆగిపోయింది. 'బాహుబలి2' సాధించిన విజయం చూసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి చిరు ఎటువంటి సంకోచాలు లేకుండా ముందుకొస్తున్నాడు. ఇక 'రామాయణం'ను 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీయడానికి మెగామాస్టర్ అల్లుఅరవింద్ డిసైడ్ అయ్యాడు.
ఓ ఎన్నారై నిర్మాత ప్రోత్సాహంతో మోహన్‌లాల్ 'రాండామూజం' నవల ఆధారంగా మహాభారతాన్ని 1000కోట్ల భారీ బడ్జెట్‌తో పలు భాషల్లో శ్రీకుమార్ దర్శకత్వంలో తీయడానికి ముందుకొచ్చాడు. వాస్తవానికి కేవలం దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో బుల్లితెరపై వందల ఎపిసోడ్స్ వచ్చిన 'రామాయణం', 'మహాభారతాలు' ఎంతగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయో నేటితరం వారికి తెలియకపోవచ్చు. అసలు 'రామాయణం' సీరియలే హిందువుల్లో ఐక్యత తెచ్చి, అయోధ్య-బాబ్రీ మసీదుపై ప్రభావం చూపిందంటారు. ఈ సీరియల్ ఆదివారం ఉదయం చానెల్స్‌లో వస్తోందంటే అంతకు ముందే పనులు పూర్తి చేసుకుని, ప్రతివారం ఈ సీరియల్ మొదలు అయ్యేముందు భక్తులు టెంకాయలు కొట్టి, హారతులు, నైవేద్యాలు ఇచ్చేవారు.
ఆరోజుల్లో ఆ సీరియల్ వచ్చే సమయంలో దేశంలోనే రోడ్లన్నీ ప్రజలు లేక వెలవెలబోయేవి. మరి నేటి సాంకేతికత, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు రామాయణం, మహాభారతాలను తీస్తే నేటితరం వారికి కూడా అందులోని గొప్పతనంతో పాటు విదేశాలలో కూడా వాటి ప్రభావం, మన సంస్కృతి, సంప్రదాయాలపై ఇతరులకు కూడా ఓ అవగాహన వచ్చే అవకాశం ఉంది. దీనిని మంచి మార్పుగా చెప్పుకోవాలి.