ఎవరెన్ని చెప్పినా.. నేడు ఇండియా కులం, మతం, ప్రాంతీయ వాదం ఆధారంగానే నడుస్తోంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, తెలంగాణలను ఏపీ మించిపోయింది. కాబట్టి ప్రతి విషయానికి ఆ లెక్కలు తప్పనిసరి అవుతున్నాయి. ఇక చంద్రబాబునాయుడు తాన టిడిపిని బిజెపితో పొత్తుపెట్టుకున్న తర్వాత ఆయనకు మైనార్టీలైన ముస్లింలు, క్రిస్టియన్లు బాగా దూరమయ్యారు. మరోవైపు మాల, ముస్లిం, క్రిస్టియన్లతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ వెంట ఉంటున్నారు.
ఎవరెన్ని చేసినా ఈ విషయంలో ప్రజల్లో మార్పురాదు. ఇక చంద్రబాబు వెంట కమ్మ సామాజిక వర్గంతో పాటు జనసేన పవన్ పుణ్యమా అని కాపులు కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇక గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన చంద్రబాబును మాదిగలు కూడా నమ్మారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మాదిగల కంటే మాల సామాజిక వర్గానిదే పైచేయి కావడంతో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ విషయంలో మౌనం పాటిస్తూండటంతో మాదిగలు కూడా బాబుకు దూరంగా జరుగుతున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ చేస్తే బాబుకు కాపులు దూరమవుతారు. పవన్ తనకి కుల,మతాలు లేవంటున్నా ఇది తప్పదు. కానీ ఇప్పుడు జగన్ మోదీకి కలిసి, ఒక్క ప్రత్యేకహోదా విషయంలో తప్ప కేంద్రంతో తమకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేదన్నాడు. దాంతో ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు బిజెపికి మద్దతు తెలిపే మాదిగలు జగన్‌కి కలిసొచ్చినా, మాలలు జగన్‌కి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఇదే అభిప్రాయాన్ని సీపీఎం నేత మధుతో పాటు సీపీఐ నారాయణ కూడా జగన్ మోదీకి మద్దతు తెలపడంపై మండిపడ్డారు.
మతాల ప్రాతిపదిక రాజకీయాలు చేసే బిజెపితో జగన్ దోస్తీని తప్పుపట్టి, దీనికి మైనార్టీల నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు తనకు మద్దతు తెలపకుండా పవన్ వెంట వెళ్లే ఉద్దేశ్యంలో ఉండబట్టే జగన్ దోస్తీకి మోదీతో చేతులు కలిపే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయ ముఖచిత్రం త్వరగా మారిపోతోంది.