ఇటీవల ఏపీ తెలుగు దేశం మంత్రి, వ్యవసాయశాఖామాత్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని, ఆయన లోకేష్‌బాబు వలే పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఈ స్టేట్‌మెంట్‌కు చిన్నబాబు ఫిదా అయిపోయినట్లున్నాడు. పదే పదే పార్ట్‌టైం, ఫుల్‌టైం అంటూ మాట్లాడుతున్నాడు.
తాజాగా ఆయన జనసేనాధిపతి పవన్ గురించి వ్యాఖ్యానిస్తూ అతనో పార్ట్ టైం పొలిటీషియన్ అని అన్నాడు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటుందా? అన్న ప్రశ్నకు టిడిపిలో పార్ట్‌టైం పొలిటీషియన్స్‌కి స్థానం లేదని, ఫుల్‌టైం కేటాయించాలని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో పవన్, ఎన్టీఆర్ అభిమానులు లోకేష్‌పై సెటైర్లు మొదలుపెట్టారు.
వెనకటి ఒకడు.. ఆవు మీద వ్యాసం రాయమంటే.. అన్నింటిలో ఆవునే వ్యాఖ్యానించినట్లుగా తనకు బాగా నచ్చిన తనకు బాగా తెలిసిన పార్ట్‌టైం పొలిటీషన్ అనే పదానికి పేటెంట్ హక్కులను లోకేష్‌బాబు తీసుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఇక టిడిపిలో వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లు చేసే వారు ఎవ్వరూ లేరా? ఎందరు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రమంత్రుల నుంచి అందరూ పార్ట్‌టైం పొలిటీషియన్స్ కాదా? ఇంతెందుకు స్వయాన లోకేష్ మావ, చంద్రబాబు బావ బాలకృష్ణ పార్ట్ టైం పొలిటీషియనా? లేక ఫుల్ టైం పొలిటీషియనా? అన్నది అసలు ప్రశ్న.
తన సొంత నియోజకవర్గం, తనను నమ్మి, తమ బాధలు తీరుస్తాడని, తమకు అందుబాటులో ఉంటాడని భావించి గెలిపించిన ప్రజలకు బాలకృష్ణ హిందూపురంకు చుట్టపుచూపుగా వెళ్లి వస్తుండటం, తన పీఏలకే పూర్తి బాధ్యతలు అప్పగించడం, దాంతో బాలయ్య పీఏలదే ఇష్టారాజ్యం కావడంపై స్వయాన ఆ నియోజకవర్గ టిడిపి నాయకులలోనే పలు అసంతృప్తులున్నాయి. ఇటీవల దున్నపోతులపై బాలయ్య పేరును రాసి ఊరేగించారు. హిందూపురం వెళ్లడానికి సమయం లేని బాలయ్య.. రణమా? శరణమా? అంటూ సినిమా కదనరంగంలోకి దూకి తన 101వ చిత్రం షూటింగ్‌లో, పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. దీనిపై లోకేష్ స్పందన ఏమిటో చెబితే బాగుంటుంది.