కిందటి ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. జగన్ ఆర్థిక నేరస్తుడు అనే అభిప్రాయం, విడిపోయిన ఏపీని చంద్రబాబు అయితేనే గాడిలో పెట్టగలడనే నమ్మకం, బిజెపి-టిడిపిలు కలిస్తే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందనే నమ్మకం... విభజన వల్ల నష్టపోయిన ఏపీకి న్యాయం జరుగుతుందనే విశ్వాసం.. మోదీ హవాలతోపాటు పవన్‌కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని దిక్కరించి టిడిపి-బిజెపి కూటమికి తెలిపిన మద్దతు వంటివి ఎన్నో కలిసి వచ్చాయి.
కేవలం పవన్ వల్లనే వీరు ఏపీలో గెలిచారా? లేదా? అనే విషయం పక్కనపెడితే అది కూడా ఈ కూటమికి ప్లస్ అయింది. కాగా కిందటి ఎన్నికల సమయంలో మృదుస్వభావి అయిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కూడా పవన్‌కి ఆనాడు కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా కొందరు.. జనసేన, పవన్ విషయం ఈ కేంద్ర పౌరవిమానయాన మంత్రి వద్ద ప్రస్తావించగా, పవనా? ఎవరో నాకు తెలియదే. ఆయనో నటుడని విన్నాను, అంతకు మించి నాకు ఆయన తెలియదు. నేను సినిమాలు చూసి 20ఏళ్లవుతోందని సమాధానం ఇవ్వడంతో పవన్ అభిమానులు కాకమీదున్నారు.
కేంద్రంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనకు ఎవ్వరూ కనిపించడం లేదని, చివరకు ఆయన కేంద్రంలో పాతుకుపోతే చంద్రబాబు ఎవరు? లోకేష్ ఎవరు? చంద్రబాబు అంటే నాకు ఎన్టీఆర్ అల్లుడని విన్నాను. లోకేష్ అంటే సీఎం చంద్రబాబు కుమారుడని విన్నాను.. అని మాట్లాడినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఓడ మల్లన్న.. బోడి మల్లన్న.. అనే సామెత అశోకగజపతిరాజుల వారికి బాగా వర్తిస్తుంది. మొత్తానికి రాజకీయాలలో దిగితే ఎవరైనా పొల్యూట్ కావాల్సిందే అనేది ఇందుకే...!