'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. కాగా ఈ చిత్రం క్రెడిట్ మొత్తాన్ని ప్రభాస్‌కు, రాజమౌళికి కట్టపెడుతున్నారు. అందులో తప్పేమి లేదు. కాగా ఈ చిత్రానికి రమ్యకృష్ణ పోషించిన రాజమాత శివగామి పాత్ర హైలైట్‌గా నిలిచింది. 'నరసింహా'లో నీలాంబరిని మించినపేరు ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ సొంతమైంది. కొందరైతే రమ్యకృష్ణని తప్ప ఆ పాత్రలో మరెవ్వరిని ఊహించుకోలేమంటున్నారు. రాజమౌళి ఆ పాత్రను అంత గొప్పగా డిజైన్ చేశాడు.
కాగా ఈ పాత్ర కోసం మొదట శ్రీదేవిని రాజమౌళి అప్రోచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాత్రకు శ్రీదేవి ఒప్పుకోలేదు. దీంతో నేడు అందరూ శ్రీదేవి మంచి అవకాశాన్ని కోల్పోయిందంటున్నారు. కాగా ఈ పాత్రను ఒప్పుకోకపోవడానికి శ్రీదేవి కారణం కాదట. ఆమె భర్త బోనీకపూర్ అని సమాచారం. ఈ పాత్ర కోసం రాజమౌళితో పాటు నిర్మాతలు ఆమెను కలవడానికి వెళ్లితే ఈ చిత్రం కథ మొత్తం విన్న బోనీకపూర్ శ్రీదేవికి భారీ పారితోషికంతో పాటు లాభాలలో వాటా అడిగాడట. కాగా ఇటీవల శ్రీదేవి వీరాభిమాని వర్మ కూడా 'అంత మంచి పాత్రను శ్రీదేవి ఎందుకు అంగీకరించలేదో అర్దం కావడం లేదు. అదే ఆమె నటించి ఉంటే ఇప్పుడు అందరూ ప్రభాస్ కంటే శ్రీదేవి గురించే ఎక్కువగా మాట్లాడేవారు' అని ట్వీట్ చేశాడు.ఎంతైనా... వర్మ చెప్పింది నిజమే.