తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, శ్రమకోర్చి, నానా ఇబ్బందులు పడి గొప్పవారవుతారు. మూడు నాలుగు తరాలకు సరిపడా సంపాదనను చేకూరుస్తున్నారు. తమ పిల్లలను కష్టపడనివ్వకుండా చూడాలని కలలు కంటారు. వారు అడిగిన వాహనాలను కొనిస్తారు. కానీ డ్రింక్ చేసి వాహనాలను నడపడం, అతి వేగం, రేసింగ్‌లతో ఈ బడాబాబులు ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని, కడుపుకోతను మిగిలిస్తున్నారు.
సాధారణ ఉద్యోగి నుంచి కమెడియన్‌గా, మంత్రిగా ఎదిగిన బాబూమోహన్, నటునిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కోటశ్రీనివాసరావుల కుమారులు ఇలా రోడ్డు ప్రమాదాలలో దుర్మరణం పాలయ్యారు. తాజాగా రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత, కోటీశ్వరుడైన పొంగూరు నారాయణ కుమారుడు కూడా హైదరాబాద్‌లో మద్యం సేవించి, విపరీతమైన వేగంతో కారును నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక ఇటీవల డ్రంక్ డ్రైవ్, కారు రేసింగ్‌లకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుని వారికి బాబూమోహన్, కోటశ్రీనివాసరావు వంటి వారి చేత కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా ఎవ్వరూ మారలేదు.
ఇక తాజాగా బాబూమోహన్ మాట్లాడుతూ, తన కుమారుడు చనిపోయినప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకొన్నానని, ఇంట్లోనే ఒంటరిగా గడిపానని, ఆ సమయంలో ఈవీవీ సత్యనారాయణ తన మనసును ఓదార్చి బ్యాంకాక్‌లో జరుగుతున్న 'ఎవడిగోల వాడిది' చిత్రం కోసం అక్కడికి తీసుకెళ్లి తనకు కాస్త మనశ్శాంతిని కలిగించాడని, ఈవీవీనే లేకుంటే తాను లేనని ఆవేదన చెందాడు.