ఒకవైపు శ్రీస్వరూపానంద వ్యాఖ్యలు, మరోవైపు పవన్‌కళ్యాణ్‌ల విమర్శలతో నేడు టిటిడి ఈవో నియామకంపై రగడ రగులుతూనే ఉంది. తాజాగా మోహన్‌బాబుతో పాటు పలువురు ఉత్తరాది వ్యక్తిని ఈవోగా నియమిస్తే తప్పేముందని వాదిస్తున్నారు. అశోక్‌కుమార్ సింఘాల్ గతంలో తెలుగు రాష్ట్రంలో ఐఏయస్‌గా పనిచేశాడని, ఆయన సమర్దవంతమైన అధికారి కాబట్టి ఆయనను నియమించడంతో తప్పేముందని అంటున్నారు.
మరికొందరు టిటిడి యాక్ట్‌ను తెలుసుకుని మాట్లాడాలని, కుల, మత, ప్రాంతీయ బేధాలకు దూరంగా ఓ ఐఏయస్‌ను టిటిడి ఈవోగా నియమించవచ్చనే వాదన వినిపిస్తున్నారు. కానీ దానిలో కొంత మాత్రమే వాస్తవం ఉంది. మతాలకు టిటిడీ ఈవోకు సంబంధం లేదనడం తప్పు. కేవలం హిందువులను, హిందు ధర్మాలను తెలిసిన వారే టిటిడీలో ఉండాలి అనే నిబంధన ఉంది. అన్యమత కార్యక్రమాలను సైతం తిరుమలలో నిర్వహించరాదు... అనే రూల్ ఉన్నట్లు సదరు వ్యక్తులకు తెలియకపోవడం దురదృష్టకరం.
మరోవైపు పవన్ వ్యాఖ్యలు కూడా కాస్త అపరిపక్వంగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఈ విషయంలో స్వామి స్వరూపానంద వ్యాఖ్యలు మాత్రమే సందర్భానుసారం ఉన్నాయి. ఆగమశాస్త్రం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. కాబట్టే ఎవ్వరూ స్వరూపానంద వ్యాఖ్యలను తిప్పికొట్టలేకపోతున్నారు. కానీ పవన్ మాత్రం లాజిక్ లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్కయిపోయాడు.