మంచి పనులకు ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాను కొందరు స్వార్థపరులు తమ కుల పిచ్చికి వేదికగా చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఓపెన్ చేయాలంటేనే భయమేస్తోంది. దీనిలో మెగాభిమానులు, నందమూరి అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అందరూ దోషులే. తాజాగా కొందరు చేసిన వ్యాఖ్యలు కులగజ్జి ఏస్థాయి ఉందో తెలియజేస్తోంది. 'బాహుబలి' 1000కోట్లు వసూలు చేసి, ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. దాంతో పవన్ ఎంతో హుందాగా తన స్పందనను తెలియజేశాడు.
కానీ పవన్‌కళ్యాణ్ అనే పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి కొందరు పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిమానుల కులగజ్జిపై, ఫ్యాన్స్ అజ్ఞానంపై ఇప్పుడు మాటల యుద్దం కొనసాగుతోంది. పవన్.. 1000కోట్లు వస్తే గానీ ట్వీట్ చేయవా! మళ్లీ నీ ఫాన్స్ తమ వల్లే ఇంతటి కలెక్షన్లు వచ్చాయంటారు. మీ ముఖాలకు సినిమాలను హిట్ చేసుకునే దమ్ములేదు... అని దూషించడం చూస్తే ఆవేదన కలగకమానదు. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా తమను అనవసరంగా కెలకవద్దని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రెచ్చిపోతున్నారు. మొత్తానికి తమకున్న కులం కంపు అందరికీ అంటగడుతున్నారు. ఇక్కడ ఓ సందేహం వస్తోంది.
నిజంగానే లోలోపల హీరోలు కుల గజ్జిని ఎంకరేజ్ చేస్తున్నారా? లేక తమ హీరోల అభిప్రాయాలకు విరుద్దంగా అభిమానులే ఈ పైత్యం చూపిస్తున్నారా? అనేది చర్చనీయాంశం అయింది. ఇక ఈ కులగజ్జి ఎలాగూ మన తరానికి కూడా అంటుకుంది. కాబట్టి దానిని వచ్చే తరాలకైనా అంటకుండా ఉండేందుకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి వ్యాఖ్యలను, అలా చేసేవారిని ఈ సోకాల్డ్ హీరోలు భేషరత్తుగా, బహిరంగంగా చెక్ చెప్పాలి. లేకపోతే ఈ పాపంలో వారి పాత్ర కూడా ఉందని తీర్మానించాల్సివస్తుంది.