ఏ కేసైనా తీర్పు వచ్చేసరికి ఏళ్లకు ఏళ్లు పడుతుందనే విమర్శలకు సుప్రీంకోర్టు చెక్‌పెట్టింది. నిర్భయ కేసులో కేవలం ఐదేళ్లలోనే తన తీర్పును చెప్పింది. కింది కోర్టు దోషులకు విధించిన ఉరిశిక్షను సమర్ధిస్తున్నామని, నేర తీవ్రతను చూస్తే ఉరిశిక్షే సరైనదని వ్యాఖ్యానించింది. దీనిని అరుదైన కేసుగా కోర్టు పరిగణించింది. సుప్రీం తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు. ఇలాంటి కఠిన శిక్షల వల్లనైనా ఇలాంటి నేరాలు చేసేవారు భయపడతారేమోనన్న చిన్న ఆశ కలుగుతోంది.
ఇక నిర్భయ కూడా తన మరణవాంగ్మూలంలో తనలాంటి పరిస్థితి ఎవ్వరికీ ఎదురుకాకూడదని, నేరం చేసిన వారిని ఉరితీయాలని పేర్కొంది. ఇక వారిని బహిరంగంగా ఉరితీయాలనే విజ్ఞాపనలు కూడా అందుతున్నాయి. మరోపక్క సుప్రీం తీర్పును కేంద్రమంత్రులు, ఇతర మహిళా నేతలు, అందరూ స్వాగతించారు. ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే బృందాకారత్ కూడా దీనికి అనుకూలంగా స్పందించడం విశేషం. ఇక కొందరు మాత్రం ఉరిశిక్ష వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే వితండవాదన చేస్తున్నారు. వారి ఇంట్లో వారికి అలాంటి అన్యాయం జరిగితే గానీ వారికి ఆ బాధ అర్ధం కాదు. మరి వారి వాదనే కరెక్ట్ అనుకుంటే మరి నేరస్తులకు ఏమి శిక్ష వేయాలో? ఇలాంటి సంఘటనలను ఎలా నిలువరించాలో కూడా వారు స్పష్టం చేయగలగాలి.
మరోవైపు ఈ కేసులో దోషి అయిన మైనర్ నేరస్ధుడి విషయంలో మాత్రం పలు విభిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేరంలో కీలకమైన వ్యక్తి ఆ మైనర్ బాలుడే. నేర తీవ్రత పెంచింది అతనే. మరి మైనర్ అనే పదం నిర్వచనంలో కూడా అర్దం మార్చి, మార్పులు చేర్పులు చేయాలి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా టీనేజ్ పిల్లలే చేస్తున్నారు. కాబట్టి మైనర్లకు ఇచ్చే వెసులుబాటును మార్చాలి. లైంగికంగా ఎదిగిన ప్రతి ఒక్కరిని మేజర్‌గానే పరిగణించాలి...!