ఇటీవల పలువురు దిగ్గజాలు అనవసరంగా మాటలు తూలుతున్నారు. ఆమధ్య ఎస్పీ బాలు బూతు పాటలపై ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఒకప్పుడు ఆయన ఎన్నో బూతు పాటలు పాడాడు. ఇక కీరవాణి మాట్లాడుతూ, తాను రిటైర్ అవుతానని, సిరివెన్నెల, వేటూరి తర్వాత తెలుగు సాహిత్యం అంపశయ్యపై ఉందన్నాడు. తాజాగా ఇళయరాజా మంచి చిత్రాలు రావడం లేదని, కాబట్టే తాను ఆచితూచి చిత్రాలు చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసి నేటి సినిమాలపై సంచలన ప్రకటన చేశాడు. వీరందరూ చెప్పిన మాటల్లో నిజం ఉండవచ్చు. వారు లెజెండ్స్ అనడంలో సందేహం లేదు.
గతంలో కీరవాణి తన కలం నుంచి ఎన్ని దిగజారుడు సాహిత్యాలు రాయలేదు. ఇళయరాజా డబ్బు కోసం ఎన్ని చిత్రాలకు మనసు చంపుకొని సంగీతం అందించలేదు? ఇక ఇది ఓ ప్రవాహం. సంగీత దర్శకులు, దర్శకులు, గేయ రచయితలు ఎంతమంది కాలగమనంలో కలిసిపోలేదు? శ్రీశ్రీ, దేవులపల్లి, మనసుకవి ఆత్రేయ, వేటూరి.. ఇలా ఎందరో వెళ్లిపోయారు. ఘంటసాల, జిక్కి, పి.బి.శ్రీనివాస్, ఎల్‌ఆర్‌ఈశ్వరి, రామకృష్ణ, కె.జె.ఏసుదాస్, జానకి, సుశీల, చిత్ర, ఎస్పీబాలు మొదలగు వారిలో స్వర్గస్తులైన వారిని వదిలేస్తే..మిగిలిన వారిలో గానమే ప్రాణంగా బ్రతుకుతున్నవారికి అవకాశాలెక్కడివి.
మనకు తెలిసి రమేష్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా, జెవి రాఘవులు, రాజ్-కోటి, బప్పిలహరి, వాసూరావు.. ఇలా ఎందరు మరుగున పడిపోలేదు. రేపు కీరవాణి అయినా దేవిశ్రీ అయినా అంతే. కానీ వారు లేరని కాలం ఆగదు. వచ్చేవారు వస్తూనే ఉంటారు. సరుకు, సత్తా ఉంటే నిలబడతారు. లేదా వచ్చినంత తొందరగా కనుమరుగవుతారు. ఇది నిజం...!