బాహుబలి2 విడుదలైన అన్నిచోట్లా బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. నిర్మాతలకు బాహుబలి2 విడుదలకు ముందే లాభాల పంట పండించింది. ఇక ఇందులో నటించిన నటీనటులకు, డైరెక్టర్ రాజమౌళికి... ఇంకా బాహుబలి టీమ్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చింది బాహుబలి ద కంక్లూజన్ చిత్రం. ఈ చిత్రం విడుదలై నేటికీ వారం రోజులైంది.
అయితే రాజమౌళి ఇంతకు ముందే ప్రభాస్ తో ఛత్రపతి చిత్రాన్ని తెరకెక్కించాడు. అందులో ప్రభాస్ ఛత్రపతి టైటిల్ రోల్ పోషించాడు. అయితే మనం బాహుబలి చిత్రాన్ని ఛత్రపతి చిత్రాన్ని ఆసక్తిగా గమనిస్తే ఈ రెండు చిత్రాలకు ఒక పోలిక కనబడుతుంది. ఛత్రపతి చిత్ర కథకు, బాహుబలి చిత్ర కథకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవేమిటంటే ఛత్రపతి చిత్రంలో భానుప్రియ.. ప్రభాస్ కి సవతి తల్లి అయినప్పటికీ తన కన్న కొడుకు షఫీ కంటే ఎక్కువ ప్రేమానురాగాలను పంచుతుంది. అలా ప్రభాస్ పై తల్లి చూపిస్తున్నప్రేమను భరించలేని షఫీ, ప్రభాస్ మీద కక్ష పెంచుకుని భానుప్రియని, ప్రభాస్ ని దూరం చేస్తాడు. తన అన్న ప్రభాస్ తో షఫీ పరోక్ష యుద్ధం చేస్తుంటాడు.
ఇక ఇక్కడ బాహుబలిలో కూడా రమ్యకృష్ణ రాజమాతగా కన్న కొడుకు భళ్లాల దేవా (రానా) కంటే మరిది కొడుకు ప్రభాస్ (అమరేంద్ర బాహుబలి) పై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. అది భరించలేని రానా, ప్రభాస్ పై తల్లికి లేని పోనివి కల్పించి అతని చంపడానికి కూడా వెనుకాడడు. ఈ రెండు చిత్రాలలో వరసకి అన్నదమ్ములైనా..కాస్త బేధం చూపించి వారి మధ్యన జరిగే యుద్దాన్ని ఛత్రపతిలో సైలెంట్గా చూపించిన రాజమౌళి బాహుబలిలో యుద్ధ సన్నివేశాలతో వైలెంట్ గా చూపించాడు. మరి ఛత్రపతి చిత్రానికి బాహుబలి చిత్రానికి కథ ఒకటే కానీ కొన్ని పాత్రలు వేరు. రాజమౌళి ఒకే కథ తో రెండు చిత్రాలను వేరు వేరు స్టైల్స్ లో తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు. అది రాజమౌళి గొప్పతనం.