గతంలో కేసీఆర్, కేటీఆర్‌లు కలిసి నాగార్జునతో కుమ్మకై ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఎన్‌కన్వెక్షన్‌ను పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నాగ్ ఫ్యామిలీని, కేసీఆర్‌ను టార్గెట్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగార్జున సతీమణి, పెటా సంస్థ(జంతు సంరక్షణ) కార్యకర్త అక్కినేని అమలకు జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ప్రాంతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడెకరాల స్థలాన్ని కేటాయించింది.
దీంతో రేవంత్ మరో సారి స్వరం పెంచాడు. నాగ్‌కి కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమైనా లింకుందా? అని ప్రశ్నించాడు. ఆంధ్రా కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణలో మన తెలంగాణా వారికి లేదా? అంటూ కేసీఆర్‌ని ఉక్కిరి బిక్కిరి చేశాడు. మన తెలంగాణ అని మాట్లాడే కేసీఆర్ ఆంధ్రా వారికి ఇప్పటికీ పెద్ద పీట వేస్తున్నారని, తెలంగాణ వారైతే ఆంద్రా వాళ్లు ఇచ్చినంత కమీషన్ ఇవ్వలేరని కాబట్టే ఆంధ్రా పెత్తందారులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని విమర్శించాడు.
పనిలో పనిగా కేసీఆర్ పిలిచి మరీ ముఖ్య పదవులు కట్టబెట్టిన పలువురు ఆంధ్రా అధికారుల పేర్లను రచ్చకీడ్చాడు. ఏదిఏమైనా మనసులో ఏదో పెట్టుకునే రేవంత్‌రెడ్డి అక్కినేని ఫ్యామిలీపై మండిపడుతున్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది.