'బాహుబలి' చిత్రం ఇప్పుడు అందరికీ చెమటలు పట్టిస్తోంది. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా భారీ కాన్వాస్‌పై, హైటెక్నిల్ స్టాండర్డ్స్‌లో సినిమా తీసి, సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే దేశ విదేశాలలో తెలుగు సినిమాలు కూడా ఏ స్థాయి కలెక్షన్స్ సాధిస్తాయో 'బాహుబలి' నిరూపించింది. ఈ చిత్రానికి ముందు టాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమైన రాజమౌళి, ప్రభాస్‌లు ఈ చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్స్ అయిపోయారు. కాగా
'బాహుబలి'ని ప్రామాణికంగా తీసుకుని సినిమాలు తీయాలని నేడు చాలా మంది ఆలోచిస్తున్నారు.
అదే భావన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లో, మెగాస్టార్ చిరంజీవిలో కూడా కలిగిందంటున్నారు. వాస్తవానికి సాహసం ముందు ఎవరు చేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. అందుకే 'సాహసం చేయరా డింభకా.. ధైర్యే సాహసే లక్ష్మీ' అనే మాటలు వచ్చాయి. ఎవరైనా ట్రెండ్ సెట్ చేయాలి గానీ ట్రెండ్‌ను ఫాలో కాకూడదు. ప్రభాస్ కంటే చిరంజీవికి తెలుగునాట ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మాట నిజం. అయితే చిరు ఓ 10, 15ఏళ్ల కిందట చేయాల్సిన సాహసాన్ని ఇప్పుడు చేస్తే ఎలా? అదే సందేహం.
ప్రస్తుతం చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తొలి తెలుగు వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని బాహుబలిని చూసిన తర్వాత మరింత గ్రాండియర్‌గా తీయాలనే నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే ఉయ్యాలవాడ మొదటి భార్య పాత్ర కోసం అనుష్కను కాకుండా భారీ పారితోషికం ఇచ్చి ఐశ్వర్యారాయ్‌ని ఈ చిత్రంలో నటింపజేసి, మరోసారి చిరు ఐశ్వర్యారాయ్ సహాయంలో బాలీవుడ్‌పై దండయాత్ర చేయనున్నాడని సమాచారం.
అంతేకాదు.. ఈ చిత్రం కాస్ట్యూమ్‌డిజైనింగ్, భారీ సెట్స్, మేకప్ వంటి వాటికి, విజువల్ ఎఫెక్ట్స్‌కి విదేశీనిపుణులను రప్పించనున్నారు. ఇక ఉయ్యాలవాడ జీవితంలో నమ్మినవారే వెన్నుపోటు పొడిచే హ్యూమన్ డ్రామా, ట్రయాంగిల్ లవ్‌స్టోరీ, ధీరత్వం వంటి అనేక సినిమాటిక్ విషయాలున్నాయి. అయితే ఈ చిత్రాన్ని అంత భారీ స్థాయిలో తీస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లేనని కొందరు వాదిస్తున్నారు. కేవలం అనుష్క, ప్రభాస్, రానా, సత్యరాజ్, నాజర్ వంటి వారితో రాజమౌళి చేసిన ట్రిక్, విజయేంద్రప్రసాద్ రైటింగ్ స్కిల్స్, కీరవాణి సంగీతం వంటివి సురేందర్‌రెడ్డి, చిరంజీవి, ఐశ్వర్యారాయ్, తమన్ వంటి వారితో సరితూచడం సాధ్యమయ్యేపనేనా?