వైజాగ్ ఆంధ్రుల ఆత్మ గౌరవ సభ అని పవన్ పిలుపిస్తే..టీడీపీ అడ్డుకోవడంతో ఆ క్రెడిట్ అంతా జగన్కే దక్కింది. ఇప్పుడు రైతులు, మరీ ముఖ్యంగా మిర్చి రైతుల గోడుకు వైసీపీ అధ్యక్షుడు జగన్.. రైతు దీక్ష చేశాడు. ఇక పవన్ కూడా మిర్చిరైతుల అవస్థలపై కాస్త ఘాటుగానే స్పందించాడు. మొత్తానికి కేంద్రం తెలుగు రాష్ట్రాలలోని మిర్చిరైతుల కష్టాలను పూర్తిగా తీర్చకపోయినా కాస్త కంటి తుడుపు చర్యగా నివారణ చర్యలు చేపట్టింది. దీంతో జగన్ మీడియా మొత్తం ఇది జగన్ వల్లనే జరిగిందని, జగన్ దీక్షకు భయపడి కేంద్రం నివారణ చర్యలు చేపట్టిందని, మోదీ, చంద్రబాబులు జగన్‌ని, ఆయనకు రైతుల మద్దతును చూసి భయపడ్డారనే ప్రచారం మొదలుపెట్టారు.
కానీ అదే సమయంలో ఈ క్రెడిట్ పవన్‌కి దక్కకుండా చేయడానికి వ్యూహాలు రచించారు. పవన్‌కి జగన్ కంటే చంద్రబాబు, మోదీల వద్ద ఎక్కువ పరపతే ఉంది. కేంద్రంపై, మోదీపై ఆయన తిరుగుబాటు చేస్తూ, ఘాటైన విమర్శలు చేస్తున్నా కూడా పవన్ పట్ల మోదీకి, చంద్రబాబుకు సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ రైతుల దీక్షకు ధీటుగా కేవలం ప్రకటనలకే పరిమితమైన లేఖల, ట్వీట్ వీరుడిగా చెడ్డపేరు తెచ్చుకోకుండా పవన్ కూడా కదనరంగంలోకి దూకి చేనేత కార్మికులపై స్పందించిన విధంగానే ఖమ్మం, గుంటూరులకు వచ్చి ఉంటే బాగుండేది.
అదే సమయంలో కనీసం లేఖల ద్వారా కాకుండా చంద్రబాబు, మోదీలను కలిసి వచ్చినా ఆ క్రెడిట్ పవన్‌కి దక్కేది. ఎంత ఆయనకు అధికారంపై మోజు లేకున్నా, పేరు ప్రఖ్యాతులపై మనసులేకున్నా కూడా తనకు దక్కాల్సిన క్రెడిట్‌ను ఆయన దక్కించుకోలేకపోయాడని, అందుకే ఆయనకు వ్యూహాలు రచించడం చేతకాదనే వాదన మాత్రం బలంగానే వినిపిస్తోంది.